Rahul Gandhi: బిహార్‌లో బీజేపీ రిమోట్ కంట్రోల్‌తోనే పాలన నడుస్తోంది: రాహుల్ గాంధీ
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్‌లో ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వం పూర్తిగా బీజేపీ రిమోట్ కంట్రోల్‌లోనే ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం సామాజిక న్యాయానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ప్రతిపక్షాల నిరంతర ఒత్తిడి వల్లనే మోదీ ప్రభుత్వం కులగణన చేపట్టేందుకు అంగీకరించిందని వ్యాఖ్యానించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన రాహుల్ గాంధీ, ముజఫ్ఫర్‌పుర్‌లో జరిగిన తన తొలి సభలో మాట్లాడారు. మహారాష్ట్ర, హర్యానాఎన్నికల్లో ఓట్ల దొంగతనం జరిగిందని, అదే విధానం బిహార్‌లో కూడా మళ్లీ కనబడే అవకాశముందని ఆరోపించారు.
వివరాలు
యమునా నది తీరంలో పూజలు చేస్తానన్న మోదీ.. ఎందుకు వెన్నకి తగ్గారు: రాహుల్
''బిహార్ ప్రభుత్వం రిమోట్ కంట్రోల్ ద్వారా నడుస్తోందని తేజస్వీ యాదవ్ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. భాజపా (BJP) కేవలం నీతీశ్ కుమార్‌ను వాడుకుంటోంది. దేశసంపద కొంతమంది సంపన్నుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. దేశంలోని సంపద కొంతమంది పెద్దల చేతుల్లోనే కేంద్రీకృతమైపోతోందని, దాంతో బిహార్ వంటి రాష్ట్రాలు పేదరికం నుంచి బయటపడలేకపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా, ఆ నష్టంపై ప్రధానమంత్రి మోదీ ఇప్పటివరకు నోరువిప్పలేదని విమర్శించారు. ఇటీవల ఛఠ్ పూజ సందర్భంగా ఢిల్లీలో యమునా నది తీరంలో పూజలు చేస్తానని మోదీ ప్రకటించారని, కానీ ఆ ఘాట్ కృత్రిమంగా నిర్మించబడినదని తెలుసుకున్న తర్వాత ఆయన వెనక్కి తగ్గారని రాహుల్ విమర్శించారు.
వివరాలు
ఆధునిక నలంద విశ్వవిద్యాలయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించింది
ఓట్ల కోసం మోదీ ఎంతకైనా వెళ్తారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'ఇండియా' కూటమి బిహార్‌లో అధికారంలోకి వస్తే ప్రతి వర్గానికి న్యాయం చేస్తామని, ప్రజల హక్కులు కాపాడేలా పాలన నడుస్తుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రాజ్యాంగ పరిరక్షణకు తమ కూటమి కట్టుబడి ఉందని, బిహార్ ప్రజలు తమ ప్రతిభను, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆధునిక నలంద విశ్వవిద్యాలయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో అమెరికా వంటి దేశాల విద్యార్థులు సైతం ఇక్కడకు చదువుకోడానికి వస్తారని ఆయన అంచనా వేశారు.
వివరాలు
రూ.500కే గ్యాస్ సిలిండర్ — తేజస్వీ యాదవ్ హామీ
మహాగఠ్‌బంధన్ సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ, తాము అధికారంలోకి వస్తే వంటగ్యాస్ సిలిండర్‌ను రూ.500కే అందిస్తామని ప్రకటించారు. ఎన్డీయే ప్రభుత్వం ఇటీవల తీసుకున్న పలు ప్రజాహిత చర్యలు తాను గతంలో ఇచ్చిన హామీల నకలేనని విమర్శించారు. రాష్ట్రం ప్రస్తుతం బాహ్య వ్యక్తుల ఆధీనంలో ఉందని, ప్రజలు ఆ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. అవినీతి, శాంతిభద్రతల విషయంలో రాజీ లేకుండా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు.
వివరాలు
రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన భాజపా..
రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా ఖండించింది. ఆయన వీధి రౌడీలా మాట్లాడుతున్నారని విమర్శిస్తూ, "ప్రధానిని అవమానించడం ద్వారా ఆయన ప్రజాస్వామ్యాన్ని కూడా అవమానించారు. ప్రధానికి ఓటు వేసిన ప్రతి పౌరుడినీ అవమానించేలా వ్యాఖ్యానించారు" అని ఆరోపించింది. కాంగ్రెస్, రాహుల్ గాంధీలు దేశంలో చొరబాటుదారులను ప్రోత్సహిస్తున్నారని భాజపా విమర్శించింది.