Telugu language: అగ్రరాజ్యంలో 'తెలుగు' వెలుగులు.. అమెరికాలో మాట్లాడే భాషల్లో 11వ స్థానం
అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా అగ్రరాజ్యంలో అత్యధికంగా మాట్లాడే విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానాన్ని దక్కించుకుంది. యుఎస్ సెన్సెస్ బ్యూరో డేటా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. గత కొన్నేళ్లుగా తెలుగువారి జనాభా పెరుగుతోంది అని చెప్పడానికి ఈ డేటా చాలు. ప్రతేడాది అగ్రరాజ్యంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య పెరుగుతోంది. 2016లో 3.2 లక్షలుగా ఉన్న తెలుగువారి జనాభా 2024 నాటికి 12.3 లక్షలకు చేరుకుంది.
తెలుగు విద్యార్థులే ఎక్కువ
ఉన్నత విద్య కోసం వెళ్లే వారిలో తెలుగు విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. ఇక సాఫ్ట్ వేరే కంపెనీల్లో పనిచేసేందుకు వెళ్లే వారి సంఖ్య కూడా పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. అమెరికాలోని నార్త్ కరోలినా, న్యూజెర్సీ, డల్లాస్, అట్లాంటా, ప్లోరిడాల్లో తెలుగు వారు ఎక్కువగా కనిపిస్తారు. ప్రతేడాది 60 నుంచి 70వేల మంది విద్యార్థులు అమెరికాకు వస్తారు. వారిలో 10వేల మంది హెచ్ 1బీ వీసాతో ఉద్యోగాలు చేసేవాళ్లు కూడా ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి.
భారతీయ విద్యార్థుల్లో 12శాతం తెలుగు విద్యార్థులు
అమెరికా భారతీయ విద్యార్థుల్లో 12శాతం మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. మాస్టర్స్ చదివేందుకు అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. యూఎస్‌లోని సిలికాన్ వ్యాలీలో ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేసే వారిలో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందినవారే కావడం గమనార్హం. అమెరికాలో పెరుగుతున్న తెలుగువారి జనాభా చూస్తుంటే కొంతకాలానికి హైదరాబాద్ లో ఉన్నా అమెరికాలో ఉన్న పెద్ద తేడా తెలియని పరిస్థితులు కనిపించే అవకాశం ఉంది.