LOADING...
Compulsory Telugu: తెలంగాణలో అన్ని పాఠశాలల్లో ఇక తెలుగు బోధన తప్పనిసరి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణలో అన్ని పాఠశాలల్లో ఇక తెలుగు బోధన తప్పనిసరి.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Compulsory Telugu: తెలంగాణలో అన్ని పాఠశాలల్లో ఇక తెలుగు బోధన తప్పనిసరి.. ప్రభుత్వం కీలక నిర్ణయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 26, 2025
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల్లో మాతృభాష బోధనపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో తెలుగులో బోధన తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగతి రాణా మెమో విడుదల చేశారు. తెలుగు బోధనపై ప్రభుత్వం స్పష్టత తెలంగాణలోని పాఠశాలల్లో నిర్బంధ తెలుగు బోధన చట్టం 2018లో ప్రవేశపెట్టినా అనేక కారణాల వల్ల పూర్తిగా అమలు కాలేదు. తాజాగా ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Details

9, 10 తరగతులకు తెలుగు తప్పనిసరి

2025-26 విద్యా సంవత్సరంలో 9, 10 తరగతులకు తప్పనిసరిగా తెలుగు బోధన అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు పాఠశాలల్లో సులభీకృత పాఠ్యాంశంగా 'వెన్నెల' పుస్తకాన్ని 9, 10 తరగతులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. పరీక్షలు కూడా తెలుగు సబ్జెక్టుగా నిర్వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణలోని సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ బోర్డుల పరిధిలోని పాఠశాలల్లో కూడా ఈ నిర్ణయం అమలవుతుంది. ఇప్పటివరకు 1-8 తరగతుల్లో మాత్రమే తెలుగును బోధించగా, ఇకపై 9, 10 తరగతుల్లోనూ తెలుగును ద్వితీయ భాషగా చదవడం తప్పనిసరి కానుంది.

Details

 తెలుగును ద్వితీయ భాషగా తప్పనిసరి 

ప్రస్తుతం 8వ తరగతి వరకు త్రిభాషా సూత్రం ప్రకారం ఆంగ్లం, హిందీ, తెలుగు బోధిస్తారు. కానీ 9, 10 తరగతుల్లో విద్యార్థులు హిందీ లేదా ఇతర భాషలను ద్వితీయ భాషగా ఎంచుకుంటున్నారు. ఇకపై, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు హిందీ లేదా ఇతర భాషల బదులుగా తెలుగును ద్వితీయ భాషగా తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. 2018-19లో ప్రవేశపెట్టిన 'వెన్నెల' పుస్తకం తెలుగు మాతృభాష కాని విద్యార్థుల కోసం 2018-19లోనే 'వెన్నెల' పేరిట సులభీకృత తెలుగు పాఠ్యపుస్తకాన్ని రూపొందించారు. ప్రస్తుతం 1-8 తరగతుల వరకు దీన్ని బోధించగా, ఇకపై 9, 10 తరగతుల విద్యార్థులు కూడా ఈ పుస్తకాన్ని ఉపయోగించవచ్చు.

Details

 తెలుగు బోధనపై ప్రభుత్వం ఉద్దేశం 

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా పాఠశాల విద్యార్థులందరికీ తెలుగును ప్రోత్సహించడం, భవిష్యత్తులో స్థానిక భాష ప్రాముఖ్యత పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. 2025-26 విద్యా సంవత్సరానికి లోగా అన్ని పాఠశాలల్లో ఈ మార్పును అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది.