LOADING...
Supreme Court: ఆలయ నిధులు దేవుడివే.. సహకార బ్యాంకులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆలయ నిధులు దేవుడివే.. సహకార బ్యాంకులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court: ఆలయ నిధులు దేవుడివే.. సహకార బ్యాంకులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 05, 2025
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆలయాలకు చెందిన నిధులను ఆర్థిక సంక్షోభంలో ఉన్న సహకార బ్యాంకులను ఆదుకోవడానికి వినియోగించడం సరికాదని సుప్రీంకోర్టు కీలకంగా స్పష్టం చేసింది. దేవాలయ సంపద పూర్తిగా దేవుని సొంతమని పేర్కొంటూ, ఆ డబ్బును కేవలం ఆలయాల అభివృద్ధి, నిర్వహణ వంటి ప్రయోజనాలకే వినియోగించాలంటూ ధర్మాసనం ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌తో పాటు జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చిలతో కూడిన బెంచ్ శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది. సహకార బ్యాంకులకు ఆదాయ వనరుగా లేదా అవి కొనసాగేందుకు దేవాలయ నిధులను ఉపయోగించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం పూర్తిగా తిరస్కరించింది. కేరళలోని తిరునెల్లి దేవస్థానం చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్లను తిరిగి చెల్లించాలని రాష్ట్ర హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది.

వివరాలు 

ఆలయాల డబ్బుతో బ్యాంకులను కాపాడాలని మీరు అనుకుంటున్నారా?

ఈ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ మనాంతవాడి కో-ఆపరేటివ్ అర్బన్ సొసైటీ లిమిటెడ్, తిరునెల్లి సర్వీస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సహా మరికొన్ని సహకార బ్యాంకులు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం, ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ''ఆలయాల డబ్బుతో బ్యాంకులను కాపాడాలని మీరు అనుకుంటున్నారా? లాభాల్లేని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సహకార బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టడం కంటే, ఎక్కువ వడ్డీ ఇచ్చే జాతీయ బ్యాంకులకు వాటిని మార్చమని ఆదేశిస్తే అందులో తప్పేముంది?'' అని జస్టిస్‌ సూర్యకాంత్ ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు వల్ల తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని బ్యాంకుల తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అయితే ఆ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు.

వివరాలు 

డిపాజిట్ డబ్బును దేవస్థానానికి చెల్లించాడానికి రెండు నెలల సమయం 

''మీరు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకోవాలి. కస్టమర్లను, డిపాజిట్లను ఆకర్షించలేకపోతే అది పూర్తిగా మీ వైఫల్యమే''అని కోర్టు తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది. దేవాలయానికి చెందిన డిపాజిట్ మొత్తాన్ని వెనక్కి చెల్లించేందుకు కొంత గడువు ఇవ్వాలనే అభ్యర్థన విషయంలో మాత్రమే కో-ఆపరేటివ్ బ్యాంకులు హైకోర్టును ఆశ్రయించుకునే అవకాశం సుప్రీంకోర్టు కల్పించింది. అయితే,ఈ కేసుల సారాంశంపై స్వయంగా విచారణ జరపడానికి మాత్రం నిరాకరించింది. తిరునెల్లి దేవస్థానం ఐదు సహకార బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు పెట్టింది. గడువు పూర్తయినప్పటికీ, పలుమార్లు కోరినా ఆ బ్యాంకులు డబ్బు తిరిగి చెల్లించలేదు. దీంతో దేవస్థానం కేరళ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం, రెండు నెలల లోపు మొత్తం డిపాజిట్ డబ్బును దేవస్థానానికి చెల్లించాలని బ్యాంకులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Advertisement