Delhi Stampede: ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల విక్రయాలపై తాత్కాలిక నిషేధం.. రైల్వేశాఖ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో మహా కుంభమేళా భక్తుల తొక్కిసలాట విషాదం నింపింది.
భక్తుల భారీ రద్దీ, సమాచారం లోపం వల్ల కలిగిన గందరగోళం కారణంగా ఒక్కసారిగా ప్రయాణికులు పరుగులు తీశారు.
ఈ ఘటనలో 18 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు.
ప్లాట్‌ఫామ్ టికెట్ల విక్రయాల నిలిపివేత
ఘటన అనంతరం ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రద్దీ నియంత్రణ చర్యలు ప్రకటించారు.
సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్లాట్‌ఫామ్ టికెట్ల అమ్మకాలను వారం పాటు నిలిపివేయనున్నట్లు వెల్లడించారు.
ఉదయం సమయంలో కూడా టికెట్ల విక్రయాన్ని పరిమితికి లోబడి నిర్వహిస్తారని స్పష్టం చేశారు.
Details
దర్యాప్తు, సీసీటీవీ పరిశీలన
రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీ దర్యాప్తు చేపట్టింది.
ప్లాట్‌ఫామ్ 14లో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన అధికారులు, శనివారం రాత్రి 9 గంటల నుంచి 9:20 గంటల మధ్య ప్రయాణికులు భారీ సంఖ్యలో స్టేషన్‌లో వేచి ఉన్నట్లు గుర్తించారు.
స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ కోసం గేటు వద్ద గుమికూడటం వల్ల తొక్కిసలాట ఏర్పడింది.
అత్యధిక టిక్కెట్ల అమ్మకమే కారణమా?
సాధారణంగా సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల మధ్యలో రోజుకు సుమారు 7,000 జనరల్ క్లాస్ టిక్కెట్లు అమ్ముతారు.
కానీ ఈ విషాదకర రోజు 9,600కిపైగా టిక్కెట్లు అమ్మడంతో భారీ రద్దీ ఏర్పడి, తొక్కిసలాటకు దారితీసినట్లు అధికారులు భావిస్తున్నారు.