కాంగ్రెస్ పాలనలో పదేళ్లను కోల్పోయాం, 2030వ దశకం భారత దశాబ్దం: ప్రధాని మోదీ
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. 10 సంవత్సరాల యూపీఏ పాలనలో ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరిందన్నారు ప్రధాని. తమ పాలనలో ఏదైనా మంచి జరిగినప్పుడు వారి(కాంగ్రెస్)కి బాధకలుగుతుందని ఆరోపించారు. 2004-2014 కాలం స్కాములతో నిండిపోయిందన్నారు. ఆ పదేళ్లలో దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరిగినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో భారత్ ఆ దశాబ్దాన్ని కోల్పోయిందన్నారు. 2030 దశకాన్ని భారత దశాబ్దంగా మోదీ అభివర్ణించారు. భారత ఆర్థిక వ్యవస్థ దుస్థితి హార్వర్డ్ యూనివర్సిటీకి కేస్‌స్టడీ అవుతుందని కొందరు(కాంగ్రెస్) చెబుతున్నారని మోదీ పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితం అదే హార్వర్డ్‌లో 'రైస్ అండ్ ఫాల్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ' అనే అధ్యయనం జరిగిందని చురకలంటించారు.
9ఏళ్లుగా ప్రతిపక్షాలు విమర్శలతో సమయాన్ని వృథా చేశాయి: మోదీ
ప్రజాస్వామ్యంలో విమర్శలు చాలా కీలకమమన్నారు ప్రధాని మోదీ. అవే ప్రజాస్వామ్యానికి బలం, స్ఫూర్తి అన్నారు. అయితే నిర్మాణాత్మక విమర్శలను ఏ ఒక్కరూ చేయలేదన్నారు మోదీ. అనవసర ఆరోపణలు చేస్తూ గత 9 ఏళ్లుగా ప్రతిపక్షాలు సమయాన్ని వృథా చేశాయన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన ఈవీఎంలపై నిందలు వేయడం, ఎన్నికల సంఘాన్ని విమర్శిచండం ప్రతిపక్షాలకు పరిపాటిగా మారిందన్నారు. తీర్పు అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టును విమర్శిస్తారని, అవినీతిపై విచారణ జరిగితే, దర్యాప్తు సంస్థలపై ఆరోపణలు చేస్తారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఒకవైపు ప్రధాని మోదీ మాట్లాడుతుండగా, మరో వైపు ప్రతిపక్షాలు అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై జాయింట్ పార్లమెంటరీ కమిషన్ (జేపీసీ)తో విచారణ జరిపించాలని లోక్‌సభలో నినాదాలు చేశాయి.