టెర్రర్ ఫండింగ్ కేసు: జమ్ముకశ్మీర్‌లో ఎన్ఐఏ విస్తృత సోదాలు
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో విచారణలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం ఉదయం జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది. టెర్రర్ ఫండింగ్‌కు సంబంధించి ఇప్పటికే హురియత్ నాయకుడు ఖాజీ యాసిర్, జమ్మూ కాశ్మీర్ సాల్వేషన్ మూవ్‌మెంట్ అధ్యక్షుడు జాఫర్ భట్‌ల ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు చేసింది. ఆ సోదాల్లో లభించిన ఆధారాల ప్రకారం ఎన్ఐఏ తాజా దాడులు చేస్తోంది.
అనుమానితుల ఇళ్లే లక్ష్యంగా దాడులు
కుల్గాం, పుల్వామా, అనంత్‌నాగ్, షోపియాన్‌లలో అనుమానితుల ఇళ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. శ్రీనగర్‌లోని సౌరా ప్రాంతంలో జైలు శిక్ష అనుభవిస్తున్న మహిళా వేర్పాటువాద నేత అసియా ఇంద్రాబీ ఇంట్లో కూడా ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. ఐఎస్ఐఎస్ కేరళ మాడ్యూల్ కేసులో సోమవారం ఎన్ఐఏ శ్రీనగర్‌లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం గమనార్హం.