కోడి కత్తి కేసు: జగన్ రావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశం
2018లో విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కోడి కత్తితో దాడి జరిగిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ తప్పకుండా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు జగన్ అభిమాని అని, ప్రజల్లో ఆయన పట్ల సానుభూతిని కలిగించేందుకు అలా చేశాడని ఆ తర్వాత తేలింది. అయితే ఈ కేసులో జగన్ ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాకపోవడంతో నిందితుడు అప్పటి నుంచి జైలులోనే మగ్గుతున్నాడు.
విచారణ ఈ నెల 14వ తేదీకి వాయిదా
ఎన్ఐఏ కోర్టు గతంలోనూ ఇదే తరహా ఆదేశాలు ఇచ్చింది. అయితే జగన్ విచారణకు హాజరు కాలేదు. మంగళవారం మరోసారి విచారించిన కోర్టు.. విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. ఈ సారి బాధితుడు జగన్ తప్పకుండా హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కేసును ఛేదించడానికి బాధితుడి వాంగ్మూలం చాలా ముఖ్యమని కోర్టు పదేపదే ప్రస్తావించింది. కానీ జగన్ కోర్టుకు హాజరు కాకపోవడంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. మరి జగన్ కోర్టుకు హాజరవుతాడో లేదో చూడాలి. సానుభూతి డ్రామా బయటపడుతుందని జగన్ విచారణకు సహకరించడం లేదని టీడీపీ ఆరోపిస్తోంది.