
Pahalgam Horror: సైనిక దుస్తుల్లో ఉగ్రవాదుల దాడులు.. భద్రతా బృందాల్లో కలవరం
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడి అనంతరం జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఉగ్రవాదులు ఇప్పుడు సైనిక యూనిఫామ్ ధరించి స్వేచ్ఛగా సంచరించటం భద్రతను గందరగోళంలోకి నెట్టింది.
ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య తేడాను గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఇది కేవలం మోసం మాత్రమే కాక, ప్రమాదకర పరిణామాలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో ఉన్నారని ప్రత్యక్ష సాక్షుల ప్రకటనలతో, భద్రతా బలగాలు ఈ విషయంపై దర్యాప్తు ముమ్మరం చేశాయి.
Details
ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు
తర్వాతి కాలంలో పలు ఎన్‌కౌంటర్లలో కూడా ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిలా కనిపించడం, ఈ కుట్ర బలంగా అమలవుతోందనే ఆందోళనకు దారి తీసింది.
ఇటీవల పుల్వామా జిల్లా థ్రాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లో జైషే మహ్మద్ ఉగ్ర ముఠాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వనీ, యావర్ అహ్మద్ భట్‌ల మృతదేహాల వద్ద లభించిన దుస్తులు, పరికరాలు సైనిక వినియోగ దుస్తులలా ఉండడం భద్రతా వర్గాలను తీవ్రంగా అలర్ట్ చేసింది.
మే 10న జమ్మూలోని నగ్రోటా మిలిటరీ స్టేషన్ సమీపంలో ఓ దుండగుడు సైనిక దుస్తుల్లో చొరబాటు యత్నానికి పాల్పడిన ఘటన మరోసారి ఇదే వ్యూహాన్ని వెల్లడించింది.
Details
సైనిక దుస్తులను పోలిన వస్త్రాల విక్రయాలపై ఆంక్షలు
భద్రతా బలగాలు అప్రమత్తమై కాల్పులు జరపగా, ఆ దుండగుడు పారిపోయాడు. ఈ చర్యలతో భద్రతా వర్గాలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
ఒకవైపు తక్షణ స్పందన అవసరమవుతున్న సమయంలో, కేవలం దుస్తుల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం కష్టం కావటంతో అపరిచితులపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇది స్థానిక ప్రజలు మరియు భద్రతా బలగాల మధ్య విశ్వాసాన్ని దెబ్బతీయే ప్రమాదం కూడా ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు సైనిక దుస్తులను పోలిన వస్త్రాల విక్రయాలపై ఆంక్షలు విధించాయి.
దేశవ్యాప్తంగా ఈ సమస్యపై చర్చ జరుగుతోంది. పహల్గాం దాడి వంటి ఘటనలు భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని స్పష్టంగా చాటుతున్నాయి.