Tesla : భారత్‌లోకి టెస్లా.. పీయూష్ గోయల్‌తో మస్క్ భేటీ ఎప్పుడో తెలుసా
భారతదేశంలోకి ప్రవేశించేందుకు టెస్లా చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. తాజాగా భారత్ దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో వచ్చే వారం ఎలాన్ మస్క్ భేటీ కానున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన విద్యుత్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత ప్రవేశంపై సమయం దగ్గరపడుతోంది. త్వరలోనే దేశీయ రోడ్లపై టెస్లా కార్లు చక్కర్లు కొట్టే అవకాశాలున్నయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాలో వచ్చేవారం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భేటీ కానున్నట్లు సమాచారం. ఇప్పటికే జర్మనీలోని గిగాఫ్యాక్టరీ నుంచి భారత్‌కు కార్లను సరఫరా చేసేందుకు టెస్లా ప్రణాళికలు రెఢీ చేసినట్లు సమాచారం.
గోయల్‌తో టెస్లా అధినేత భేటీ ఆసక్తికరం
జూన్‌లో అగ్రరాజ్యం అమెరికాలో మోదీ పర్యటించిన సందర్భంగా ఆయనతో ఎలాన్ మస్క్ సమావేశమయ్యారు. భారత్‌లో గణనీయ స్థాయిలో పెట్టు బడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్నట్లు వెల్లడించడం గమనార్హం.ఈ క్రమంలోనే టెస్లా అధినేత మస్క్ తాజాగా గోయల్‌తో భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది. ఇండియాలో ఫ్యాక్టరీ ఏర్పాటు, దేశీయంగా పరికరాల కొనుగోలు, ఛార్జింగ్ మౌలిక వసతుల ఏర్పాటుపై ప్రధానంగా చర్చించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. స్వదేశంలో కొంత మేరకు తయారు చేసే కంపెనీలకు, అవి దిగుమతి చేసుకొనే ఇతర మోడళ్లపై (Completely Built Up)సుంకాన్ని 15 శాతం మేర తగ్గించడం అంశం చర్చకు రానుంది. ఈ మేరకు పూర్తిగా విదేశాల్లో తయారై భారత్‌కు వచ్చే వాహనాలపై ప్రస్తుతం 100 శాతం వరకు సుంకం విధిస్తోంది కేంద్రం.
ఈవీ విధానాన్ని సరికొత్తగా రూపొందించేందుకు కసరత్తులు
అయితే దేశీయంగా కొన్ని మోడళ్లు తయారు చేసిన కంపెనీలకు దిగుమతి సుంకంలో రాయితీ ఇవ్వాలని కేంద్రం ప్రభుత్వం భావిస్తోంది. ఫలితంగా ఈవీ విధానాన్ని సరికొత్తగా రూపొందించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఈ మేరకు PMO సోమవారం పలు మంత్రిత్వ శాఖలతో చర్చలు జరిపారు. దిగుమతి సుంకం తగ్గింపుతో దేశీయ ఈవీ కంపెనీలపై దాని ప్రభావం ఏ మేర ఉంటుందనే అంశాన్ని అంచనా వేస్తున్నామని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. 2021 నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు టెస్లా ఉవ్విళ్లూరుతోంది. ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని టెస్లా కోరుతోంది. ఇందుకు ప్రభుత్వం షరతులను విధించగా, ఈ క్రమంలోనే దఫాలుగా చర్చలు సాగుతున్నాయి. దేశంలోనే వాహన తయారీ సహా ప్రాంతీయంగా విడిభాగాలను కొనుగోలు చేయాలని స్పష్టం చేయడం కొసమెరుపు.