LOADING...
TET Exams: టెట్‌ పరీక్షలు ప్రారంభం.. తొలి రోజే 80శాతం హాజరు
టెట్‌ పరీక్షలు ప్రారంభం.. తొలి రోజే 80శాతం హాజరు

TET Exams: టెట్‌ పరీక్షలు ప్రారంభం.. తొలి రోజే 80శాతం హాజరు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2026
01:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) శనివారం ప్రారంభమైంది. తొలిరోజు జరిగిన పరీక్షలకు మొత్తం అభ్యర్థుల్లో సుమారు 80 శాతం మంది హాజరయ్యారు. ఈ రోజు పేపర్‌-2 (గణితం, సైన్స్‌) పరీక్ష నిర్వహించగా, ఉదయం సెషన్‌లో 17,605 మందికి గాను 14,089 మంది, మధ్యాహ్నం సెషన్‌లో 17,856 మందికి గాను 14,127 మంది పరీక్ష రాశారు. పరీక్ష రాసిన అభ్యర్థుల ప్రకారం పేపర్‌-2 గణితం, సైన్స్‌ ప్రశ్నలు మధ్యస్థ స్థాయిలో ఉన్నాయి. తెలుగు విభాగానికి సంబంధించిన ప్రశ్నలు మాత్రం సులభంగా ఉన్నాయని వారు తెలిపారు. ఆదివారం ఉదయం 85 కేంద్రాల్లో, మధ్యాహ్నం 91 కేంద్రాల్లో టెట్‌ పరీక్షలు జరగనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్‌ నికోలస్‌ వెల్లడించారు.

Details

 మహిళలకు గుర్తింపు కార్డు ఇబ్బందులు 

టెట్‌ పరీక్ష రాసే ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో, పాఠశాల విద్యాశాఖ ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు తెలిపారు. టెట్‌ పరీక్ష కేంద్రాల వద్ద మహిళా అభ్యర్థులు గుర్తింపు కార్డు విషయంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నారు. ఎక్కువ మంది హాల్‌టికెట్‌తో పాటు ఆధార్‌ కార్డును తీసుకొచ్చారు. అయితే హాల్‌టికెట్‌లో విద్యార్హత ధ్రువపత్రాలపై ఉన్న ఇంటిపేరు ఒకలా ఉండగా, వివాహం అనంతరం ఆధార్‌ కార్డులో ఇంటిపేరు మారిపోవడంతో తేడా కనిపించింది. ఈ నేపథ్యంలో అధికారులు వారి నుంచి డిక్లరేషన్‌ తీసుకుని పరీక్షకు అనుమతించారు.

Advertisement