
Raj Thackeray: ఒకే వేదికపై ఠాక్రే బ్రదర్స్.. 20 ఏళ్ల విరామానికి ముగింపు!
ఈ వార్తాకథనం ఏంటి
దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ముంబయిలో జరిగిన 'వాయిస్ ఆఫ్ మరాఠీ' కార్యక్రమంలో ఒకే వేదికను పంచుకున్నారు. మహారాష్ట్ర మంత్రివర్గం త్రిభాషా విధానానికి సంబంధించి తీసుకున్న ఉత్తర్వులను ఉపసంహరించుకోవడంతో, ఈ కార్యక్రమం ప్రతిపక్ష విజయాన్ని సూచిస్తూ నిర్వహించారు. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన నేత రాజ్ తమ కుటుంబసభ్యులతో కలిసి పాల్గొని, ఛత్రపతి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్ ఠాక్రే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆంగ్ల మాధ్యమ విద్యపై నరేంద్ర మోదీ ప్రభుత్వం తప్పుదారి పడుతోందని అన్నారు. దక్షిణ భారతదేశ నాయకులు ఇంగ్లీష్ మీడియంలో చదివినా, తమ మాతృభాషలపై గౌరవం చూపుతున్నారని పేర్కొన్నారు.
Details
మరాఠీపై గౌరవం కలిగి ఉండాలి
అదేవిధంగా మహారాష్ట్ర ప్రజలు మరాఠీపై గౌరవం కలిగి ఉండాలని ఆకాంక్షించారు. హిందీ భాషకు వ్యతిరేకత లేనప్పటికీ, దాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నాలను తాము సమర్థించబోమని చెప్పారు. అంతేకాదు, మరాఠా సామ్రాజ్యం విస్తరించినప్పటికీ భాషను ఎవరిపై రుద్దలేదని పేర్కొన్నారు. ఇప్పటికీ సుప్రీం కోర్టు, హైకోర్టుల్లోని ఉత్తర్వులు ఆంగ్లంలోనే ఉండగా, మహారాష్ట్రపై త్రిభాషా విధానాన్ని ఎందుకు రుద్దాలని చూస్తున్నారో కేంద్రం బోధపర్చుకోవాలన్నారు. అంతేగాక, తమను ఒకే వేదికపైకి తీసుకురావడం బహుళ యత్నాల తర్వాత వీలుకాలేదని, చివరకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తీసుకున్న నిర్ణయం ద్వారానే ఇది సాధ్యమైందని రాజ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఐక్యత కోసం ఇకపై తాము ఒకటిగా ఉంటామని స్పష్టం చేశారు.