Thalapathy' Vijay: దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం దాదాపు ఖరారు.. లోక్‌సభ ఎన్నికల ముందే పార్టీ పేరు ప్రకటన
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం దాదాపుగా ఖరారైంది. మరో రెండు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందే తన రాజకీయ పార్టీని స్థాపించనున్నారు. ఈ మేరకు తన రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను కూడా విజయ్ ఇప్పటికే ప్రారంభించాడు. ఎన్నికల కమిషన్ వద్ద పార్టీని నమోదు చేసే ప్రక్రియలో ఉన్నట్లు విజయ్ టీమ్‌లోని కీలక సభ్యుడు ఎన్‌డీటీవీకి తెలిపారు. తమిళనాడులో దాదాపు 200మంది పార్టీ జనరల్ కౌన్సిల్ సభ్యుల సమావేశం జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంలో అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారిని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల ముందు పార్టీని ప్రకటించినా.. తమిళనాడులో 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.
పార్టీ పేరులో 'కజగం' అనే పదం
తమిళనాడులో జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో విజయ్‌ను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ఎన్డీటీవీ నివేదించింది. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, కోశాధికారిని కూడా నియమించామని, కేంద్ర కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు ఏర్పాటు చేసినట్లు విజయ్ టీమ్‌లోని ప్రముఖ వ్యక్తి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ్ రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తారని, తమిళనాడు సంప్రదాయానికి అనుగుణంగా పార్టీ పేరులో కచ్చితంగా 'కజగం' అనే పదం ఉంటుందని ఆ ప్రముఖ వ్యక్తి ఎన్డీటీవీ వెల్లడించారు. ఎన్నికల సంఘం వద్ద పార్టీ నమోదు ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేసి.. సార్వత్రిక ఎన్నికలకు ముందే రాష్ట్రంలో అధికారికంగా పార్టీని ప్రకటిస్తామని తెలిపారు.
సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా విజయ్
విజయ్ చాలా కాలంగా తమిళనాడులో సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఉచిత భోజనం, విద్యా ఉపకార వేతనాలు, గ్రంథాలయ నిర్మాణం తదితర అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సొంతంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన నియోజకవర్గాల వారీగా పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన విద్యార్థులను అభినందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విజయ్ తండ్రి ప్రముఖ సినీ దర్శకుడు చంద్రశేఖర్. సినీ నేపథ్య కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చినా.. తనకంటూ సొంత ఇమేజ్‌ను తెచ్చుకున్నారు. ప్రస్తుతం తమిళాడులోనే కాకుండా, సౌత్‌లోనే ప్రముఖ స్టార్ హీరోగా ఉన్నారు. సౌత్ ఇండియాలో రజనీకాంత్ తర్వాత అంతటి పాపులర్ హీరో విజయ్.