Oldest Elephant: దేశంలోనే అత్యంత వృద్ధాప్య ఏనుగు 'బిజులీ ప్రసాద్' మృతి
అసోంలో సోనిత్‌పూర్ జిల్లాలోని తేయాకు తోటల్లో ఇన్నిరోజులు రాజుగా జీవించిన 'బిజులీ ప్రసాద్' అనే పెంపుడు ఏనుగు సోమవారం ఉదయం కన్నుమూసింది. ఈ ఏనుగు వయసు 89 సంవత్సరాలు అని అధికారులు తెలిపారు. ఇది దేశంలోనే కాకుండా, ప్రపంంచంలోనే ఎక్కువ కాలం జీవించిన ఏనుగుగా వైద్యులు చెబుతున్నారు. వృద్ధాప్య సమస్యల కారణంగా బిజులీ ప్రసాద్ తెల్లవారుజామున 3.30 గంటలకు ది విలియమ్సన్ మాగోర్ గ్రూప్‌కు చెందిన బెహాలీ టీ ఎస్టేట్‌లో తుది శ్వాస విడిచినట్లు అధికారులు వెల్లడించారు. ఇంగ్లండ్‌కు చెందిన అతని ఆలివర్ సాహిబ్ ఈ ఏనుగుకు 'బిజులీ ప్రసాద్' పేరు పెట్టారు. ఏనుగు మృతితో దానితో అనుబంధం ఉన్న జంబో ప్రేమికులు, తేయాకు తోటల కార్మికులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
అడవి ఏనుగుల ఆయుష్షు 65 ఏళ్లు మాత్రమే
బిజులీ ప్రసాద్ మృతిపై పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రసిద్ధ ఏనుగు శస్త్రవైద్యుడు డాక్టర్ కుశాల్ కొన్వర్ శర్మ మాట్లాడారు. తనకు తెలిసినంతవరకు బిజులీ ప్రసాద్ భారతదేశంలో ఎక్కువ కాలం జీవించిన ఏనుగు అని పేర్కొన్నారు. సాధారణంగా, అడవి ఏనుగులు 62-65 సంవత్సరాల వరకు జీవిస్తాయన్నారు. అయితే పెంపుడు జంతువులు సరైన సంరక్షణతో సుమారు 80 సంవత్సరాల వరకు జీవిస్తాయి. కానీ బిజులీ ప్రసాద్ అన్నింటికంటే ఎక్కువగా 89ఏళ్లు జీవించినట్లు పేర్కొన్నారు. సుమారు 8-10 సంవత్సరాల క్రితం బిజులీ ప్రసాద్ పళ్ళన్నీ ఊడిపోవడంతో అది ఏమీ తినలేక పోయినట్లు గుర్తు చేశారు. ఆ సమయంలో దాని ఆహారాన్ని మార్చడంతో బిజులీ ప్రసాద్ మరికొన్ని ఏళ్లు ఆరోగ్యంగా బతికినట్లు పేర్కొన్నారు.