Ram Mandir Timeline: 1528- 2024 వరకు అయోధ్య రామాలయ నిర్మాణంలో కీలక ఘట్టాలు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
500 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి తెరదించుతూ ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించారు.
రామమందిర నిర్మాణ అంత సులువుగా ఏం జరగలేదు. రామాలయ నిర్మాణం కోసం ఎందరో తమ ప్రాణాలను పణంగా పెట్టారు.
ఈ క్రమంలో బాబ్రీ మసీదు నిర్మాణం నుంచి రామాలయ ప్రాణ ప్రతిష్ట వరకు.. గత 500ఏళ్లలో జరిగిన కీలక ఘట్టాలను ఇప్పుడు ఓసారి గుర్తు చేసుకుందాం.
1528: బాబ్రీ మసీదు ప్రారంభం
మొఘల్ చక్రవర్తి బాబర్ కమాండర్ మీర్ బాకీ 1528లో బాబ్రీ మసీదును నిర్మించాడు. అప్పటి నుంచి రామ మందిర ఉద్యమం ప్రారంభమైంది.
రామమందిరం శిథిలాలపై మసీదును నిర్మించారన్న నమ్మకాల నేపథ్యంలో శతాబ్దాలుగా రెండు వర్గాల మధ్య ఘర్షణలకు అయోధ్య వేదికగా మారింది.
అయోధ్య
1858: నిహాంగ్ సిక్కుల డిమాండ్
అయోధ్య రామజన్మ భూమిపై నియంత్రణ కోసం పోరాటానికి తొలి అడుగు 1858లో పడింది.
ఆ ఏడాది నిహాంగ్ సిక్కులు శ్రీరాముడి జన్మస్థలంగా బాబ్రీ మసీదును చెప్పే ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి వివాదం రాజుకుంది.
1885: బాబ్రీ మసీదుపై మొదటి కేసు
1885లో మసీదు బయటి ప్రాంగణంలో రామాలయాన్ని నిర్మించేందుకు అనుమతి కోరుతూ నిర్మోహి అఖారా పూజారి రఘుబర్ దాస్ దావా వేశారు.
బాబ్రీ మసీదుపై ఇదే మొట్ట మొదటి దావా. ఈ దావానే ఈ వివాదాన్ని అధికారికంగా రికార్డు చేసి.. సజీవంగా ఉంచింది.
బ్రిటీష్ పాలకులు వివాదస్పద స్థలంలో హిందువులు, ముస్లింల కోసం వేర్వేరు ప్రార్థనా స్థలాలను గుర్తించి..కంచెలను ఏర్పాటు చేశారు.
దాదాపు 90ఏళ్లపాటు అలాగే హిందువులు, ముస్లింలు పూజలు చేశారు.
అయోధ్య
1949: బాబ్రీ మసీదులో శ్రీరాముడి విగ్రహాలు
స్వాతంత్య్రం వచ్చిన రెండేళ్ల తర్వాత 22డిసెంబర్ 1949న బాబ్రీ మసీదు గోపురం కింద శ్రీరాముడి విగ్రహాలను బయటపడ్డాయి.
ఇది హిందువుల్లో తీవ్రమైన భావోద్వేగాలను రగిలించింది. ఆ తర్వాత ఇరు వర్గాలు న్యాయ పోరాటానికి దిగారు.
1950: స్వాతంత్య్రం అనంతరం మొదటి విచారణ
స్వాతంత్య్రం తర్వాత బాబ్రీ మసీదుకు సంబంధించిన మొదటి కేసును హిందూ మహాసభ సభ్యుడు గోపాల్ సింగ్ విశారద్ 1950లో ఫైజాబాద్‌లోని సివిల్ జడ్జి కోర్టులో దాఖలు చేశారు.
గోపురం కింద ఉన్న దేవుని విగ్రహాలను పూజించేందుకు అనుమతివ్వాలని విశారద్ డిమాండ్ చేశాడు.
ఆ తర్వాత మహంత్ రామచంద్ర పరమహంస్ కూాడా మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో హిందువుల పూజలను అడ్డుకోవద్దని కోర్టు ముస్లిం పక్షాన్ని ఆదేశించింది.
అయోధ్య
1959: నిర్మోహి అఖారా పిటిషన్
డిసెంబర్ 17, 1959న, రామానంద్ వర్గం తరపున నిర్మోహి అఖారాకు చెందిన ఆరుగురు వ్యక్తులు రామజన్మ భూమి వివాదాస్పద స్థలంపై దావా వేశారు. హిందువుల పూజకు అనుమతించాలని డిమాండ్ చేశారు.
దానికి వ్యతిరేకంగా 1961 డిసెంబర్ 18న మరో పిటిషన్ దాఖలైంది. దీన్ని ఉత్తరప్రదేశ్‌లోని సెంట్రల్ సున్నీ వక్ఫ్ బోర్డు దాఖలు చేసింది.
1982: పుణ్యక్షేత్రాల విముక్తి కోసం ప్రచారం
రాముడు, కృష్ణుడు, శివుడు కొలువైన ప్రదేశాల్లో మసీదుల నిర్మాణాన్ని కుట్రగా అభివర్ణించి.. పుణ్యక్షేత్రాల విముక్తి కోసం విశ్వహిందూ పరిషత్ 1982లో ప్రచారం చేపట్టింది.
8ఏప్రిల్ 1984న దిల్లీలోని సాధువులు, హిందూ నాయకులు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి స్థలం విముక్తి కోసం బాబ్రీ మసీదు తాళం తెరవడానికి ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నారు.
అయోధ్య
1986: బాబ్రీ మసీదు ప్రాంగణం తెరిచారు
న్యాయవాది ఉమేష్ పాండే దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఫైజాబాద్ జిల్లా న్యాయమూర్తి కేఎం పాండే 1వ తేదీ ఫిబ్రవరి, 1986న మసీదు ప్రాంగణం తాళాన్ని తెరవాలని ఆదేశించారు.
ఈ తీర్పును సవాల్ చేస్తూ ముస్లిం వర్గం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో తాళ తెరవడంపై కోర్టు స్టే విధించింది.
1989: రామజన్మభూమిలో ఆలయ శంకుస్థాపన
1989జనవరిలో ప్రయాగలో జరిగిన కుంభమేళా సందర్భంగా రామమందిర నిర్మాణం కోసం ప్రతి గ్రామంలో శిలాపూజ నిర్వహించాలని నిర్ణయించారు.
అలాగే, 9నవంబర్ 1989న, శ్రీరామ జన్మభూమి స్థలంలో ఆలయ పునాది రాయి వేయాలని ప్రకటించారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ శంకుస్థాపనకు అనుమతి ఇచ్చారు. బీహార్ నివాసి కామేశ్వర్ చౌపాల్ శంకుస్థాపన చేశారు.
అయోధ్య
1990: అద్వానీ రథయాత్ర
1990లో రామజన్మ భూమి ఉద్యమం ఊపందుకుంది. దీంతో ఇదే ఏడాది సెప్టెంబర్‌లో లాల్ కృష్ణ అద్వానీ రథయాత్రకు శ్రీకారం చుట్టారు.
ఈ యాత్ర రామజన్మభూమి ఉద్యమానికి ఊపునిచ్చింది. దేశ రాజకీయాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది.
1992: బాబ్రీ మసీదు కూల్చివేత
డిసెంబర్ 6, 1992న అయోధ్యకు చేరుకున్న వేలాది మంది కరసేవకులు వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేశారు.
బదులుగా అదే రోజు సాయంత్రం తాత్కాలిక ఆలయాన్ని నిర్మించి పూజలు ప్రారంభించారు.
కేంద్రంలోని అప్పటి పీవీ నరసింహారావు సర్కార్.. రాష్ట్రంలోని కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంతో సహా ఇతర రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వాలను రద్దు చేసింది.
ఆ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌తో సహా దేశంలోని అనేక చోట్ల మత హింసలు జరిగాయి.
అయోధ్య
1993: దర్శనం, పూజలకు అనుమతి మంజూరు
బాబ్రీ విధ్వంసం జరిగిన రెండు రోజుల తర్వాత 1992 డిసెంబర్ 8న అయోధ్యలో కర్ఫ్యూ విధించారు.
శ్రీరాముడికి దూప దీప నైవేధ్యాలను అందించేందుకు అనుమతించాలనిన్యాయవాది హరిశంకర్ జైన్ హైకోర్టు లక్నో బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు.
దాదాపు 25 రోజుల తర్వాత 1993 జనవరి 1న న్యాయమూర్తి హరినాథ్ తిల్హరి దర్శనానికి, పూజలకు అనుమతి ఇచ్చారు.
2002: హైకోర్టులో యాజమాన్య హక్కులపై విచారణ
ఏప్రిల్ 2002లో హైకోర్టు లక్నో బెంచ్ రామజన్మ భూమి వివాదాస్పద స్థలం యాజమాన్యాన్ని నిర్ణయించడానికి విచారణను ప్రారంభించింది.
5 మార్చి 2003న, ఈ స్థలంలో తవ్వకాలు జరపాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను హైకోర్టు ఆదేశించింది.
వివాదాస్పద స్థలం భూగర్భంలో హిందూ మత ఆనవాళ్లు సర్వేలో తేలింది.
అయోద్య
2010: అలహాబాద్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు
సెప్టెంబరు 30, 2010న, అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద స్థలాన్ని శ్రీ రామ్ లాలా విరాజ్‌మన్, నిర్మోహి అఖారా, సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్‌కు సమానంగా పంచాలని ఆదేశించింది.
విగ్రహాలు ఉన్న కేంద్ర గోపురం కింద ఉన్న ప్రదేశాన్ని న్యాయమూర్తులు శ్రీరామ జన్మ జన్మస్థలంగా పరిగణించారు.
హైకోర్టు తీర్పు తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. మార్చి 21, 2017న, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది.
ఇరు వర్గాలు అంగీకరిస్తే.. మధ్యవర్తిత్వం వహించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ధర్మాసనం పేర్కొంది.
అయోధ్య
2019: సుప్రీంకోర్టులో సంచలన తీర్పు
6 ఆగస్టు 2019న, సుప్రీంకోర్టు వివాదాస్పద స్థలంపై విచారణలను ప్రారంభించింది.
2019అక్టోబరు 16న సుప్రీంకోర్టులో విచారణ పూర్తయింది. దాదాపు 40 రోజుల పాటు విచారించిన కోర్టు.. తీర్పును నవంబర్ 9, 2019న వెలువరించింది.
వివాదాస్పద స్థలాన్ని శ్రీరామ జన్మభూమిగా పరిగణించింది. 2.77 ఎకరాల భూమిని రాంలాలాకు చెందినదిగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
అదే సమయంలో, నిర్మోహి అఖారా, సున్నీ వక్ఫ్ బోర్డు వాదనలు పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
ఆలయ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం మూడు నెలల్లోగా ట్రస్టును ఏర్పాటు చేయాలని, నిర్మోహి అఖారా ప్రతినిధిని ట్రస్టులో చేర్చాలని కోర్టు ఆదేశించింది.
ఇది కాకుండా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ముస్లింలు మసీదు నిర్మించడానికి అనువైన స్థలంలో 5 ఎకరాల భూమిని అందించాలని ఆదేశించింది.
అయోధ్య
2020: అయోధ్యలో రామమందిర శంకుస్థాపన
దశాబ్దాల న్యాయ పోరాటం ముగిసింది. 5 ఫిబ్రవరి 2020న అయోధ్యలో ఆలయ నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు.
సరిగ్గా ఆరు నెలల తర్వాత, 5 ఆగస్టు 2020న, అయోధ్యలో రామ మందిరానికి పునాది రాయి వేశారు.
ఇందులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. 2024: శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రామజన్మభూమి వద్ద ఆలయ మొదటి దశ పనులు పూర్తయ్యాయి.
22 జనవరి 2024న శ్రీరాముడ గర్భగుడిలో ఆసీనులయ్యారు. చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా ప్రధాని మోదీ అభివర్ణించారు.
ఈ ఆలయం జనవరి 23 నుంచి సాధారణ భక్తుల దర్శనం కోసం తెరవబడుతుంది.