Page Loader
Hyderabad: నరికి.. కుక్కర్‌లో ఉడకబెట్టి.. చెరువులో పడేసి.. భార్యను అతికిరాతకంగా చంపిన భర్త 
నరికి.. కుక్కర్‌లో ఉడకబెట్టి.. చెరువులో పడేసి.. భార్యను అతికిరాతకంగా చంపిన భర్త

Hyderabad: నరికి.. కుక్కర్‌లో ఉడకబెట్టి.. చెరువులో పడేసి.. భార్యను అతికిరాతకంగా చంపిన భర్త 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2025
02:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

గురుమూర్తి, ఆర్మీలో పనిచేసి రిటైర్‌ అయిన వ్యక్తి. ప్రస్తుతం డీఆర్డీఓలో ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రకాశం జిల్లాలోని జేపీ చెరువుకు చెందిన గురుమూర్తికి, 13 ఏళ్ల క్రితం మాధవితో వివాహం అయ్యింది. అప్పట్లో ఆర్మీలో పనిచేస్తున్న అతను, 35 ఏళ్ల వయసులోనే రిటైర్‌ అయ్యాడు. హైదరాబాద్ మీర్‌పేటలోని ఒక అపార్ట్‌మెంట్‌లో కుటుంబంతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అయితే, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. ఇవి మరింత తీవ్రరూపం దాల్చి, మోస్ట్‌ బ్రూటల్‌ మర్డర్‌కు దారితీసింది.

వివరాలు 

పండగ రోజే భార్యను కిరాతకంగా హతమార్చాడు

గురుమూర్తి తన భార్య మాధవిని చంపాలని పక్కాగా నిర్ణయం తీసుకున్నాడు. అందుకోసం సంక్రాంతి సెలవులను ఈ నేరానికి ఎంచుకున్నాడు. తన పిల్లలను జనవరి 13న అత్తమామల ఇంటికి పంపించాడు. అపార్ట్‌మెంట్‌లోనూ చాలామంది పండక్కి ఊర్లకు వెళ్లిపోయారు. దీంతో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ఈ సందర్బాన్ని ఆసరాగా తీసుకున్న గురుమూర్తి, జనవరి 15న పండగ రోజే భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఆమెను చంపిన తరువాత, శరీరాన్ని ముక్కలుగా చేసి, ఆ ముక్కలను కుక్కర్‌లో ఉడికించాడు. ఆ తర్వాత ఆ మాంసాన్ని ఎండబెట్టి పొడిగా మార్చి, జిల్లెల్లగూడలోని చందన చెరువులో పడేశాడు.

వివరాలు 

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న ఘటన 

ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. జనవరి 16న మాధవి అత్తమామలతో ఫోన్‌ చేసి, ఆమె గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిందని గురుమూర్తి చెప్పాడు. ఆమె తమ దగ్గరికి రాలేదని వారు చెప్పినప్పటికీ, అతను కంగారుగా నటిస్తూ తరచూ ఫోన్‌ చేసి ఆరా తీస్తున్నాడు. కానీ, పోలీసులకు ఫిర్యాదు మాత్రం చేయలేదు. జనవరి 18న మాధవి తల్లిదండ్రులు హైదరాబాదుకు వచ్చి పోలీసులను సంప్రదించారు. సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించిన పోలీసులు, మాధవి ఇంట్లోకి ప్రవేశించినప్పటికీ తిరిగి బయటకు రాకపోవడం గమనించారు. అనంతరం గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

వివరాలు 

సీసీటీవీ ఫుటేజ్‌ కీలక పాత్ర

విచారణలో ఒక్కో విషయం బయటకు వస్తుంటే.. పోలీసులే షాకయ్యారు. మాధవిని హతమార్చిన తర్వాత, ఆమె మృతదేహాన్ని ఎలా మాయం చేశాడన్న విషయం వాళ్లను ఆశ్చర్యానికి గురి చేసింది. హత్య జరిగినా, శవం ఆనవాళ్లు లేవు. నేరం చేసిందెవరో తెలిసినా, నిరూపించేందుకు సరైన ఆధారాలు లేవు. ఒక సైకో క్రిమినల్ మైండ్‌తో చేసిన ఈ హత్య, షాకింగ్‌గా మారింది. గురుమూర్తి తన మిలటరీ అనుభవంతో హత్య తర్వాత ఆధారాలను పూర్తిగా నశింపజేశాడు. ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్‌ కీలక పాత్ర పోషించింది.