మణిపూర్ ఘర్షణల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం, ఉద్యోగాలు
మణిపూర్‌లో ఇటీవల జరిగిన జాతి హింసలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం ఆర్థికసాయంతో పాటు ఇంటికో ఉద్యోగాన్ని ఇస్తామని ప్రకటించాయి. రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం అధికారులు ప్రకటన విడుదల చేశారు. పరిహారం మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రం ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయని అధికారులు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ మధ్య జరిగిన సమావేశంలో పరిహారం ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.
మణిపూర్‌లో మహిళా నేతలతో అమిత్ షా భేటీ
రాష్ట్రంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు, పుకార్ల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక టెలిఫోన్ లైన్లను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. పెట్రోల్, ఎల్‌పిజి గ్యాస్, బియ్యం, ఇతర ఆహార ఉత్పత్తుల వంటి నిత్యావసర వస్తువులను ధరలను తగ్గించడానికి పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచాలని కూడా అమిత్ షా ఈ మేరకు అధికారులను ఆదేశించారు. హోంమంత్రి అమిత్ షా మంగళవారం మణిపూర్‌లో మహిళా నేతలతో సమావేశమయ్యారు. వారిని కలిసిన తర్వాత, రాష్ట్రంలో శాంతిని నెలకోల్పేందుకు తాము కట్టుబడి ఉన్నామని అమిత్ షా భరోసా ఇచ్చారు. మణిపూర్‌లో పౌర సమాజ సంస్థల ప్రతినిధి బృందాన్ని కూడా అమిత్ షా కలుసుకున్నారని ఎంహెచ్ఏ ప్రతినిధి తెలిపారు.