
2024 ఎన్నికల్లో జేడీ లక్ష్మీ నారాయణ పోటీ చేసే నియోజకవర్గం ఖరారు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో 2024లో ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పునరుద్ఘాటించారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని కూడా వెల్లడించారు. తాను అసెంబ్లీ కంటే వైజాగ్ లోక్‌సభ సీటుకే ప్రాధాన్యత ఇస్తానని లక్ష్మీనారాయణ ప్రకటించారు.
2019లో ఇదే స్థానానికి జనసేన నుంచి పోటీ చేసిన లక్ష్మీనారాయణ రెండు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. లక్ష్మీ నారాయణకు ఇది మొట్టమొదటి ఎన్నికలు కావడం గమనార్హం. 23.3 శాతం ఓట్లతో ఆ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచారు.
ఎన్నికల తర్వాత జనసేన నుంచి బయటికి వచ్చారు. ఆ తర్వాత ఆయన ఏ పార్టీలో చేరలేదు. ఆయితే 2024 ఎన్నికల్లో ఏ పార్టీలో చేరకుండా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
లక్ష్మీ నారాయణను చేర్చుకోవడానికి ఏ పార్టీ సిద్ధంగా లేదా?
లక్ష్మీ నారాయణ తాను నమ్మిన సిద్ధాంతం ప్రకారం రాజకీయం చేయాలని మొదటి నుంచి అనుకుంటున్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఎలాంటి ప్రలోభాలకు పాల్పకుండా తనకు నిజాయతీగా ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నారు.
నమ్మిన సిద్ధాంతం విషయంలో ముక్కుసూటిగా ఉండే, లక్ష్మీ నారాయణను చేర్చుకోవడానికి ప్రస్తుతం ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో లక్ష్మీ నారాయణ కూడా ఏ రాజకీయ పార్టీలో చేరాలనుకోవడం లేదని తెలుస్తోంది.
తన రాజకీయ దృక్పథానికి సరితూగే పార్టీలో మాత్రమే చేరుతానని, అలా జరగని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమని లక్ష్మీ నారాయణ వెల్లడించారు.