
Dalai Lama: చైనాకు దలైలామా కౌంటర్: తన వారసుడి ఎంపికపై స్పష్టత ఇచ్చిన బౌద్ధ గురువు
ఈ వార్తాకథనం ఏంటి
టిబెటియన్ బౌద్ధమతానికి అత్యున్నత అధికారి అయిన దలైలామా తాజాగా చైనాకు గట్టి షాక్ ఇచ్చారు. 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందనీ,దానిని నిర్వహించడానికి హక్కు గల ఏకైక సంస్థ గాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్ట్ మాత్రమేనని ఆయన తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని దలైలామా స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇప్పటికే 2011 సెప్టెంబర్ 24న,టిబెట్ బౌద్ధ మతనేతలు,ప్రముఖులు,వివిధ సంస్థలతో సమావేశం నిర్వహించిన తాను,తన తరువాతి వారసుడి ఎంపిక జరగాలా లేదా అనే అంశంపై వారి అభిప్రాయాలు కోరినట్లు గుర్తుచేశారు. అందుకు ప్రతి వర్గం నుంచీ సానుకూల స్పందనలు వచ్చాయని చెప్పారు. ఇందులో టిబెట్ మత పెద్దలతో పాటు చైనాలోని కొంతమంది వ్యక్తులూ ఉన్నారని తెలిపారు.తన వారసత్వం భవిష్యత్తులో కొనసాగాలని వారంతా అభిప్రాయపడ్డారని చెప్పారు.
వివరాలు
దలైలామా పునర్జన్మను ప్రకటించే పూర్తి హక్కు గాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్ట్‌కే..
తన వారసుడి అవసరమా లేదా అనే విషయాన్ని ప్రజలే నిర్ణయించాలన్న ఉద్దేశాన్ని తాను ఇంకా 1969లోనే ప్రకటించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాజా అభిప్రాయాల వెలుగులో చూస్తే, దలైలామా పునర్జన్మను ప్రకటించే పూర్తి హక్కు గాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్ట్‌కే ఉన్నదనీ, ఈ ప్రక్రియలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని ఆయన స్పష్టం చేశారు. ఒక దశలో తన తరువాత ఈ సంప్రదాయం ముగిసిపోతుందేమో అనే భయం తనకు కలిగిందని చెప్పారు. కానీ ఆ తర్వాత తన పునర్జన్మ టిబెట్ వెలుపల కూడా జరగొచ్చని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 1950లో టిబెట్‌ను ఆక్రమించిన చైనా, ఆ ప్రాంతాన్ని పూర్తిగా తన అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
వివరాలు
టిబెట్‌లో బహుమూల్య ఖనిజ సంపదలు
టిబెట్‌ను గుప్పిట పెట్టుకోవడానికి దలైలామా వారసుడిని తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా నియమించాలన్న యత్నాలు చైనా నుంచి సాగుతున్నాయి. ముఖ్యంగా హాన్ జాతివారిని టిబెట్ ప్రాంతాల్లో స్థిరపరిచి ప్రజాసంఖ్య మార్పులకు చైనా పాలకులు కృషి చేశారు. టిబెట్ ఆక్రమణ అనంతరం వేలాది మంది టిబెటియన్ పిల్లలను ఇతర ప్రాంతాలకు తరలించి, వారి ఆలోచనల్ని మార్చే విధంగా ప్రణాళికాబద్ధంగా బ్రెయిన్‌వాష్ చేశారు. టిబెట్‌లో బహుమూల్య ఖనిజ సంపదలు ఉండటంతో ఆ భూభాగాన్ని చైనా పూర్తిగా నియంత్రించాలన్నదే వారి అసలు లక్ష్యమని విశ్లేషకులు చెబుతున్నారు. బొగ్గు, రాగి, లిథియం, క్రోమియం, జింక్, సీసం, బోరాన్ వంటి ఖనిజాల వల్ల ఆ ప్రాంత ప్రాధాన్యత మరింత పెరిగింది.
వివరాలు
పంచెన్ లామా పాత్ర కీలకం
దలైలామా స్థానాన్ని భవిష్యత్తులో తమ నియంత్రణలోకి తీసుకోవాలన్నదే చైనాకు ఉన్న వ్యూహం. ఈ నేపథ్యంలో పంచెన్ లామా పాత్ర కీలకమవుతుంది. టిబెట్‌లోనే ఉన్న పంచెన్ లామా 1989లో అనుమానాస్పద స్థితిలో మరణించడంతో, ఆయన విషప్రయోగానికి గురయ్యారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత పంచెన్ లామా వారసుడిగా చిన్న బాలుడిని తమ అదుపులో ఉంచుకున్నట్లు బీజింగ్ అధికారికంగా ప్రకటించింది. ఈ పరిణామాలన్నింటినీ గమనించిన దలైలామా, తన పునర్జన్మ టిబెట్ వెలుపల కూడా జరగొచ్చని స్పష్టం చేశారు. అంతేకాదు, తన తరువాతి పునర్జన్మ పొందిన వారసుడిని ఎంపిక చేసే అధికారాన్ని పూర్తి స్థాయిలో తమ వద్దే ఉంచుకుంటున్నట్లు గాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్ట్‌కు మాత్రమే హక్కుందని ఆయన మరోసారి హితవు పలికారు.