Jammu And Kashmir Polls: జమ్మూ కశ్మీర్‌లో తుది దశ పోలింగ్ ప్రారంభం.. 40 స్థానాలకు 415 మంది బరిలో!
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ దశలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి, వాటిలో 24 జమ్మూ డివిజన్‌లో, 16 కాశ్మీర్ డివిజన్‌లో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 415 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొతం 39.18 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 5,060 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 20 వేల మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్నారు.
అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు
370వ అధికరణం రద్దు అనంతరం పశ్చిమ పాకిస్థాన్ శరణార్థులు, వాల్మీకి సమాజం, గూర్ఖా తెగలవారు ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. జమ్మూ డివిజన్‌లోని 24 అసెంబ్లీ స్థానాల్లో హిందూ మెజారిటీ కలిగిన జమ్మూ, సాంబా, కథువా, ఉదంపూర్ జిల్లాల్లో ఓటింగ్ జరుగుతోంది. 415 మంది అభ్యర్థులలో ముఖ్యులుగా మాజీ ఉప ముఖ్యమంత్రులు తారా చంద్, ముజఫర్ బేగ్‌లు ఉన్నారు. అంతేకాక పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజ్జాద్ లోన్, నేషనల్ పాంథర్స్ పార్టీ ఇండియా అధ్యక్షుడు దేవ్ సింగ్ కూడా ప్రధాన పోటీలో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అక్టోబర్ 5న, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.