Gandhi Temple: నిత్యం ధూప, దీప, నైవేద్యాలు పెట్టే ఈ గుడి స్పెషల్ ఏంటో తెలుసా..? ఇది ఎక్కడ ఉందొ తెలుసా?
బ్రిటిష్ వారి నుండి దాస్య విముక్తి కోసం భారతీయులు ఎంతో కృషి చేశారు. స్వాతంత్య్రం సాధించడానికి మహాత్మా గాంధీ కీలక పాత్ర పోషించారు. నేడు గాంధీ జయంతి సందర్భంగా, గాంధీ ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం తెలంగాణలో ఉంది. అతి కొద్ది మందికి తెలిసిన ఈ ఆలయం, రోజు రోజుకీ భక్తులకు సందర్శన స్థలంగా మారుతోంది. హైదరాబాద్‌కి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిట్యాల్ పట్టణానికి సమీపంలోని పెద్ద కాపర్తి గ్రామంలో గాంధీ దేవాలయం నిర్మించబడింది. ఈ ఆలయాన్ని సందర్శించడం స్థానికులకి సెంటిమెంట్‌గా మారుతోంది. మహాత్మా గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి పివి కృష్ణారావు చెప్పినట్లుగా, ఈ ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
2014లో మహాత్మా గాంధీ పాలరాతి విగ్రహం
సాధారణ రోజుల్లో 60-70మంది సందర్శకులు ఉండగా, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమాల తర్వాత ఇప్పుడు దాదాపు 350 మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారని వివరించారు. 2012లో మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భూమి పూజ చేయగా.. 2014,సెప్టెంబర్ 17న ఆలయంలో మహాత్మా గాంధీ పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆగస్టు 15స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనప్పటికీ, అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ప్రత్యేక పూజలు జరిగాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చి ప్రార్థన చేస్తుండడం వల్ల ఆలయం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. హైదరాబాద్-విజయవాడ హైవే సమీపంలోని నాలుగు ఎకరాల స్థలంలో నిర్మితమైన ఈ ఆలయంలో మహాత్ముడు కూర్చున్న భంగిమలో ప్రజలకు ఆశీర్వాదాలు అందిస్తున్నారు.
కులాంతర వివాహాల కోసం నామమాత్రపు ధరకు కల్యాణ మండపం
చిట్యాల్ సమీపంలోని గ్రామస్తులు ఇంట ఎవరిదైనా పెళ్లి జరిగితే ఆలయ ట్రస్ట్ వారు ఆ జంటకు పట్టు వస్త్రాలను అందించడం ప్రారంభించారు. వారు వివాహ ఆహ్వాన పత్రాలను పంపిణీ చేయకముందు పూజలు చేసి బాపు ఆశీర్వాదాలను పొందడం ఒక సంప్రదాయంగా మారింది. గ్రామస్థులు మహాత్ముడిని దైవత్వంతో కూడిన వ్యక్తిగా చూస్తారు.తెలంగాణ పర్యాటక శాఖ ఈ ఆలయాన్ని రాష్ట్రంలో ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా గుర్తించింది. ఆలయం ప్రాంగణంలో కల్యాణ మండపం కూడా ఉంది. ఇక్కడ మద్యం,మాంసం తినడం నిషేధం అన్న నిబంధనలతో ఆలయ ట్రస్ట్ పెళ్లిళ్లకు అనుమతినిస్తుంది. కులాంతర వివాహాల కోసం నామమాత్రపు ధరకు కల్యాణ మండపాన్ని అద్దెకు ఇస్తారు.