మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం: అజిత్ పవార్‌ను కలిసిన ఉద్ధవ్ ఠాక్రే
మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన తర్వాత తొలిసారిగా ఎన్‌సీపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో శివసేన (యూబీటీ) నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే బుధవారం సమావేశమయ్యారు. బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల సమావేశం ముగిసిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన జరగడం ఆసక్తికరంగా మారింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మొదలై, ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణం స్వీకారం తర్వాత అజిత్ పవార్‌ను ఠాక్రే కలుసుకోవడం ఇదే తొలిసారి. శివసేన సంక్షోభం కారణంగా మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పడిపోయినప్పుడు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా, ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నారు.
అజిత్ పవార్‌ను అభినందించా: ఉద్ధవ్ ఠాక్రే
అజిత్ పవార్‍తో బేటీ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన నేపథ్యంలో తాను అజిత్ పవార్‌ని కలుసుకుని అభినందించినట్లు ఠాక్రే చెప్పారు. అజిత్ పవార్ ప్రజలకు మంచి చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను 2019లోనూ ఆయనతో కలిసి పనిచేసినట్లు గుర్తు చేశారు. ఆయన వర్కింగ్ స్టైల్ నాకు తెలుసనని చెప్పారు. రాష్ట్రానికి, పౌరులకు సహాయం చేయడానికి తన ప్రయత్నాలను కొనసాగించాలని ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అజిత్ పవార్‌ను ఉద్ధవ్ థాకరే కోరారు.