
బిపోర్‌జాయ్ సైక్లోన్: సౌరాష్ట్రలో 100 ఆసియాటిక్ సింహాలను కాపాడేందుకు అటవీశాఖ తంటాలు
ఈ వార్తాకథనం ఏంటి
బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్‌తో అరేబియా తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఈ క్రమంలో గురువారం తుపాను తీరం దాటే సమయంలో గణనీయమైన నష్టం వాటిల్లుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.
ఈ నేపథ్యంలో సౌరాష్ట్ర ప్రాంతంలో ఆసియాటిక్ సింహాలను కాపాడేందుకు గుజరాత్ రాష్ట్ర అటవీ శాఖ ముందస్తు చర్యలు తీసుకుంటోంది.
తీర ప్రాంతాల్లో ఉన్న 100కు పైగా సింహాలను అత్యంత భద్రతతో ఉంచారు. వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సింహాలను బీట్ గార్డుల నిఘాలో ఉంచడంతో పాటు వాటి రక్షణకోసం అటవీశాఖ అధికారులు వివిధ రకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు.
తీరానికి దగ్గరగా ఉన్న గిర్ సోమనాథ్-భావనగర్ మార్గంలో ఉన్న దాదాపు 30సింహాలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
సింహాలు
తీరం వెంబడి 21కంట్రోల్ పాయింట్ల ఏర్పాటు
అవసరమైతే సింహాలను సమీపంలోని కొండల వంటి ఎత్తైన ప్రాంతాలకు తరలిస్తామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
ఖాకీ దుస్తులు ధరించిన ఫ్రెండ్లీ-బీట్ గార్డులు సింహాలను సురక్షిత స్వర్గధామానికి చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ముగ్గురు నుంచి నలుగురు ఉండే ఫ్రెండ్లీ-బీట్ గార్డు సమూహాలు జంతువులను దాదాపు కిలోమీటరు దూరంలో ఉన్న ప్రదేశాల వైపు ఆకర్షించడానికి వాటికి తెలిసిన శబ్దాలను ఉపయోగిస్తారు.
ఈ ట్రిక్ ద్వారా ఒక సింహాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లయితే, మిగిలినవి కూడా వాటిని అనసరిస్తాయి.
అటవీశాఖ తీరం వెంబడి 21కంట్రోల్ పాయింట్లను ఏర్పాటు చేసింది, ఇందులో వైద్య బృందాలు, రెస్క్యూ బృందాలు ఉన్నాయి.
తుపాను వల్ల ఏవైనా అత్యవసర పరిస్థితులు లేదా సవాళ్లు ఎదురైనప్పుడు వేగంగా స్పందించేందుకు ఈ బృందాలు ఉపయోగపడుతాయి.