Loading...
Revanth Reddy: మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యం.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యం.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు

Revanth Reddy: మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యం.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 22, 2026
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలను వందశాతం పాటిస్తామని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో నిర్వహించిన రాజకీయ వ్యవహారాల కమిటీ, పీసీసీ సలహా కమిటీ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల కోసమే తిరిగి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

వివరాలు

మంచి విషయాలు మైక్‌లో.. చెడు విషయాలు చెవిలో చెప్పండి

పార్టీ నేతలు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని రేవంత్‌రెడ్డి సూచించారు. మంచి విషయాలను మైక్‌లో చెప్పాలని, చెడు విషయాలను చెవిలో చెప్పాలని హితవు పలికారు.

రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ హయాంలో ప్రారంభమైన పలు కార్యక్రమాలను కూడా ప్రస్తుతం కొనసాగిస్తున్నామని వివరించారు.

వివరాలు

ఏపీ ప్రాజెక్టులపై రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ప్రాజెక్టుల అంశంపై కూడా సీఎం స్పందించారు. పల్నాడు వాటర్ గ్రిడ్ పథకం 2022లో కేసీఆర్, జగన్ ప్రభుత్వాల హయాంలోనే ప్రారంభమైందని తెలిపారు.

జల్ జీవన్ మిషన్ కింద రూ.1,580 కోట్లకు సంబంధించిన జీవో కూడా అప్పుడే విడుదలైందని వివరించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సైతం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ప్రారంభమైందని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ హయాంలోనే ఏపీలో ప్రాజెక్టులు చేపట్టారని ఆరోపించారు.

299 టీఎంసీల నీటి వినియోగానికి కేసీఆర్ సంతకం చేయడం ఆధారంగానే ఏపీలో ప్రాజెక్టులు చేపట్టారని విమర్శించారు.

ADVERTISEMENT

వివరాలు

తెలంగాణ ప్రాజెక్టుల భూసేకరణకు నిధులివ్వలేదు

తెలంగాణలో ప్రాజెక్టుల భూసేకరణ కోసం కూడా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

గత ప్రభుత్వ నిర్ణయాల వల్లే ప్రాజెక్టులకు సంబంధించిన పలు అంశాలు ప్రభావితమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT