New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం శుభవార్త.. అక్టోబర్ నుంచి దరఖాస్తులు
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల గురించి శుభవార్త ప్రకటించింది. అక్టోబర్‌లో కొత్త రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ రోజు నాలుగో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా, మరోసారి సమావేశం కావాల్సి ఉంటుందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. గత పదేళ్లలో నామమాత్రంగా మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చారని ఆయన చెప్పారు. అదనంగా, ఖరీఫ్ సీజన్ నుండి సన్న వడ్లకు క్వింటాల్‌కు ₹500 అదనంగా ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. అలాగే, జనవరి నుంచి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అందించనున్నట్లు మంత్రి తెలిపారు.
బై ఎలక్షన్ ఉన్న నియోజకవర్గాల్లోనే రేషన్ కార్డులు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొత్త రేషన్ కార్డులు పారదర్శకంగా ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం 49,476 కార్డులు మాత్రమే ఇచ్చారని.. అవి కూడా బై ఎలక్షన్ ఉన్న నియోజకవర్గాల్లోనే ఇచ్చారని చెప్పారు. సిస్టమాటిక్‌గా ఏ ప్రాంతంలోనూ ఇవ్వలేదని, తమ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డులు అందరికి ఇస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 21న మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.