M K Stalin: గవర్నర్ తన పదవినే అవమానించారు.. అసెంబ్లీలో ఎం.కె.స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి (Tamil Nadu Governor R N Ravi) వ్యవహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ (M K Stalin) తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడు అసెంబ్లీలో మాట్లాడిన స్టాలిన్.. సమావేశాలు ప్రారంభమైన తొలి రోజున గవర్నర్ ప్రసంగించకుండా వ్యవహరించడం ద్వారా తన పదవినే అవమానించుకున్నారని అన్నారు. గతంలో ఏ గవర్నర్ కూడా ఇలాంటి ప్రవర్తన చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, కరుణానిధి, ఎం.జి.రామచంద్రన్, జయలలిత హయాంలో ఎప్పుడూ చూడని రాజకీయ సంక్షోభాన్ని ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్నానని స్టాలిన్ వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి సంక్షోభాలు తనకు కొత్త కాదని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని వాటన్నింటినీ విజయవంతంగా అధిగమించానని చెప్పారు.
Details
గవర్నర్ సభ మధ్యలోనే వెళ్లిపోయారు
అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో తన ప్రసంగాన్ని చదవకుండా జాతీయ గీతాన్ని (National Anthem) ప్లే చేయాలని గవర్నర్ పట్టుబట్టారని స్టాలిన్ వెల్లడించారు. ప్రసంగం ముగిసిన తర్వాత జాతీయ గీతాన్ని ప్లే చేస్తామని చెప్పినా గవర్నర్ వినకుండా సభ మధ్యలోనే వెళ్లిపోయారని ఆరోపించారు. తన స్థానాన్ని గౌరవించని వారు దేశభక్తి గురించి మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. దేశభక్తిపై తమకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన తమిళనాడు తొలి శాసనసభ సమావేశంలో గవర్నర్ ఆర్.ఎన్.రవి తన ప్రసంగాన్ని చదవకుండానే సభ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.
Details
ఇది వరుసగా నాలుగోసారి
ఈ వ్యవహారంపై గవర్నర్ స్పందిస్తూ.. తమిళ తల్లి ప్రార్థనా గీతం పూర్తైన వెంటనే జాతీయ గీతాన్ని ఆలపించకుండా వదిలేశారని, ప్రసంగ సమయంలో పలుమార్లు మైక్ కట్ చేసి తనను అవమానించారని ఆరోపించారు. ఈ కారణంగానే సభ నుంచి బయటకు వచ్చానని వివరణ ఇచ్చారు. కాగా శాసనసభ సమావేశాల నుంచి గవర్నర్ ఆర్.ఎన్.రవి మధ్యలో వెళ్లిపోవడం వరుసగా ఇది నాలుగోసారి కావడం రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం-రాజ్‌భవన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత తాజా పరిణామాలతో మరింత తీవ్రతరమైంది.