AP Cyclone Effect : ఏపీకి ముంచుకొస్తున్న తుపాను ప్రభావం.. ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రేపటికి (అక్టోబర్ 22) ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది. బుధవారం నాటికి తుపానుగా రూపాంతరం చెంది, ఆ తర్వాత వాయువ్య దిశగా పయనించనుంది. గురువారం ఉదయానికి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం, ఈ అల్పపీడనం గురువారం రాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల సమీపంలో పూరీ, సాగర్ ద్వీపం మధ్య తీరం దాటనుంది.
సముద్రంలో వేటకు వెళ్లకూడదు
ఈ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం వంటి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. మత్స్యకారులు ఈ నెల 25 వరకు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. తుపాను సన్నద్ధతపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, ఏపీ తరఫున రెవెన్యూ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా పాల్గొన్నారు. రేపు, ఎల్లుండి ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.