అలుపెరగని శిల్పకారుడు 'రామ్ వంజీ సుతార్'; 98ఏళ్ల వయసులో అంబేద్కర్ విగ్రహానికి రూపం
హైదరాబాద్‌లో 125అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. సమానత్వం మూర్తిభవించిన ఆ విగ్రహాన్ని రూపొందించిన శిల్పకారుడు 98ఏళ్ల రామ్ వంజీ సుతార్. ఈ వయుసులో కూడా ఆయన అలుపు అనేది లేకుండా ఎంతో నైపుణ్యంతో అంబేద్కర్ విగ్రహానికి రూపొందించడంలో అహర్నిషలు కష్టపడ్డారు. ఈ సందర్భంగా ఆయన గురించిన విశేషాలను తెలుసుకుందాం. రామ్ వంజీ సుతార్ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శిల్పుల్లో ఒకరు. గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ (వల్లభాయ్ పటేల్) శిల్పి కూడా సుతార్ కావడం గమనార్హం. పార్లమెంటు భవనం లోపల మహాత్మా గాంధీ విగ్రహంతో సహా అనేక ప్రసిద్ధ విగ్రహాలను సుతార్ చెక్కారు. ఈయన రూపొందించిన విగ్రహాలు ఇంగ్లాండ్,ఫ్రాన్స్,రష్యా వంటి ఇతర దేశాల్లో కూడా ప్రతిష్టించారు.
సుతార్‌కు 1999లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్
శిల్పిగా తన కెరీర్ ప్రారంభంలో 1954-1958లో మహారాష్ట్రలోని అజంతా, ఎల్లోరా గుహల అనేక పురాతన శిల్పాలను పునరుద్ధరించడంలో సుతార్ కృషి ఉంది. సుతార్‌కు మొదట గుర్తింపు తెచ్చింది మాత్రం, మధ్యప్రదేశ్‌లోని 45అడుగుల చంబల్ స్మారకచిహ్నం. ఈ చిహ్నాన్ని ఒకే రాతితో రూపొందించారు. దీనిని 1961లో ఆవిష్కరించారు. భాక్రా నంగల్ డ్యామ్‌ను నిర్మించిన కార్మికుల శ్రమకు గుర్తుగా 50అడుగుల కాంస్య స్మారక చిహ్నాన్ని రూపొందించడానికి నెహ్రూ సుతార్‌ను నియమించారు. చెన్నైలోని ట్రంప్ ఆఫ్ లేబర్ విగ్రహం, దిల్లీలోని గోవింద్ బల్లభ్ పంత్, కర్పూరి ఠాకూర్, బీహార్ విభూతి అనుగ్రహ నారాయణ్ సిన్హా, అమృత్‌సర్‌లోని మహారాజా రంజిత్ సింగ్ లాంటి ప్రసిద్ధ విగ్రాహాలు సుతార్ సృష్టే. సుతార్‌ను కేంద్రం 1999లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్‌తో సత్కరించింది.