టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా లంచాల ఆరోపణల వెనుక ఉన్నది మాజీ సన్నిహితుడేనా?
లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే తనకు ఓ సుప్రీంకోర్టు న్యాయవాది ఇచ్చిన బలమైన సాక్ష్యాల వల్లే తాను ఈ ఆరోపణలు చేస్తున్నట్లు దూబే పేర్కొన్నారు. ఇంతకీ ఆ న్యాయవాది ఎవరు అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆ న్యాయవాది ఎవరో కాదని మహువా మొయిత్రా మాజీ ప్రియుడు జై అనంత్ దేహడ్రాయ్‌గా తెలిసింది. కొంతకాలం క్రితం ఇద్దరు విడిపోయినట్లు బయటకు వచ్చింది. లంచాల ఆరోపణ నేపథ్యంలో ఎంపీ మహువా పలువురికి లీగల్ నోటీసులు జారీ చేసారు. అందులో అదానీ గ్రూప్, బీజేపీ ఎంపీ దూబే, దేహడ్రాయ్‌తో మీడియా సంస్తలు ఉన్నాయి.
అనంత్ దేహడ్రాయ్‌పై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు
జై అనంత్ దేహడ్రాయ్ తన మాజీ భాగస్వామిగా లీగల్ నోటీసుల్లో మహువా మోయిత్రా పేర్కొన్నారు. అంతేకాదు, న్యాయవాదిపై తీవ్రమైన ఆరోపణలు చేసారు. తన వ్యక్తిగత ఆస్తులను కాజేసారని, కుక్క దొంగతనం చేసారని, అసభ్యకరమైన సందేశాలను పంపారని దేహడ్రాయ్‌పై తీవ్ర విమర్శలు చేసారు. ఈ వ్యవహారాల వల్ల తాను పోలీసులకు కూడా దేహడ్రాయ్‌పై ఫిర్యాదు చేసినట్లు మహువా తన నోటీసుల్లో వివరించారు. ఈ క్రమంలో తనపై పగ తీర్చుకునేందుకు బీజేపీ ఎంపీతో దేహడ్రాయ్‌పై చేతులు కలిపినట్లు ఆరోపించారు. తనపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని, బహిరంగ క్షమాపణలు చెప్పాలని లీగల్ నోటీసులో డెహాడ్రాయ్‌ను టీఎంసీ ఎంపీ డిమాండ్ చేసింది.
విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి: దూబే
పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి మొయిత్రా ఒక వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకున్నారని దుబే ఆరోపించారు. ఈ ఆరోపణల్లో నిజానిజాలను తేల్చేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని బిర్లాను కోరారు. కేంద్ర అశ్విని వైష్ణవ్, సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌లకు ఈ విషయాన్ని నిగ్గు తేల్చాల్సిందిగా, ఇందుకోసం దర్యాప్తు ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని ఎథిక్స్ కమిటీకి విన్నవించారు. మహువా మొయిత్రా- రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త హీరానందానీ గ్రూప్ సీఈఓ దర్శన్ హీరానందానీ మధ్య లంచాల లావాదేవీలు జరిగిట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అన్నారు. ఇటీవల లోక్‌సభలో మహువా మొయిత్రా అడిగిన 61ప్రశ్నల్లో 50ప్రశ్నలు దర్శన్ హీరానందానీ వ్యాపార ప్రయోజనాలకు సంబంధించినవే ఉన్నాయని దూబే ఆరోపించారు.
సోషల్ మీడియాలో అదానీపై మహువా మొయిత్రా ఫైర్
బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన ఆరోపణలను సోషల్ మీడియా వేదికగా కూడా మహువా మొయిత్రా ఖండించారు. ఈ ఆరోపణల వెనుక అదానీతో పాటు తన మాజీ ప్రియుడు ఉన్నట్లు ఆమె ఆరోపించారు. అయితే ఈ ట్వీట్‌లో తన ప్రేమికుడు ఎవరు మాత్రం మొయిత్రా చెప్పలేదు. అంతేకాదు, అదానీపై తీవ్రస్తాయిలో మండిపడ్డారు. నకిలీ డిగ్రీ ఉన్న ఎంపీతో, తాను తిరస్కరించబడిన ప్రేమికుడి సహాయంతో తనపై దాడి చేస్తున్నారా? అని అదానీని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణంలో భారతీయుల నుంచి దోచుకున్న రూ.13,000 కోట్లను ఈడీ, సీబీఐ రికవరీ చేసే వరకు తాను మౌనంగా ఉండబోనని మొయిత్రా తన పోస్ట్‌లో పేర్కొన్నారు.