Tamil Nadu: 'ఇది పొరపాటు మాత్రమే.. వేరే ఉద్దేశం లేదు': ఇస్రో ప్రకటనలో చైనా రాకెట్ ఫొటోపై తమిళనాడు మంత్రి
ఇస్రో కొత్త లాంచ్ ప్యాడ్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రకటనలో 'చైనీస్ జెండా' కనిపించడంపై తమిళనాడులో వివాదం చెలరేగింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా దీనిపై తీవ్రస్థాయిలో విమర్శించారు. తమిళనాడులోని ఇస్రో లాంచ్ కాంప్లెక్స్‌కు క్రెడిట్ దక్కేలా చైనా స్టిక్కర్‌ను వేశారని మండిపడ్డారు. ఇది మన దేశానికి అవమానమన్నారు. భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్తలకు అవమానమన్నారు. ప్రధాని ప్రకటించిన ఒక రోజు తర్వాత.. డీఎంకే మంత్రి అనితా ఆర్.రాధాకృష్ణన్ స్పందించారు. ఇది డిజైనర్ తప్పిదమని అన్నారు. ఇది కేవలం పొరపాటు మాత్రమే అని, ఇందులో వేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తమ హృదయాల్లో భారతదేశంపై ప్రేమ మాత్రమే ఉందన్నారు. భారతదేశం ఐక్యంగా ఉండాలన్నదే తమ పార్టీ వైఖరి అని రాధాకృష్ణన్ అన్నారు.
యాడ్ డిజైనర్లు గమనించని తప్పు చేశారు: రాధాకృష్ణన్
తమిళనాడులోని కులశేఖరపట్టణంలో కొత్త ఇస్రో లాంచ్ కాంప్లెక్స్ కోసం డిమాండును మొదట లేవనెత్తింది దివంగత కరుణానిధి అని రాధాకృష్ణన్ అన్నారు. అంతేకాకుండా, రాష్ట్రంలో లాంచ్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, తూత్తుకుడి లోక్‌సభ సభ్యురాలు కనిమొళి కేంద్రాన్ని కోరినట్లు పేర్కొన్నారు. అందుకే ఈ ప్రాజెక్టును తమిళనాడుకు తీసుకురావడానికి డీఎంకే నేతలు చేసిన ప్రయత్నాలను హైలైట్ చేసేందుకు ఈ ప్రకటన ఇచ్చినట్లు చెప్పారు. యాడ్ డిజైనర్లు గమనించని తప్పు చేశారన్నారు. ఆ ప్రకటనను ప్రచురించినందుకు ప్రజలకు డీఎంకే క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ డిమాండ్ చేశారు.