Runamafi: రుణమాఫీ కాని రైతులకు త్వరలో డబ్బులు జమ .. ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రుణమాపీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రకటించిన రూ. 2లక్షల రైతు రుణమాఫీ మూడో విడతలో అమలైంది. తెలంగాణ ప్రభుత్వం రూ.31 వేల కోట్లు ఖర్చు చేసి రైతుల రుణాలను మాఫీ చేసింది. మొదటి విడతలో రూ. లక్ష వరకు, రెండో విడతలో రూ. లక్షన్నర వరకు, మూడో విడతలో రూ. 2 లక్షల వరకు రుణాలు మాఫీ అయ్యాయి. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా, అర్హులైన కొంతమంది రైతులకు రుణమాఫీ అందలేదు. పట్టా, బ్యాంకు, ఆధార్ కార్డుల వివరాలు సరిపోకపోవడం, రేషన్ కార్డుల లేమి వంటి సమస్యల వల్ల కొందరు రైతులకు రుణమాఫీ సాయం అందలేదు.
డబ్బులు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు
ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టింది. గ్రామాల స్థాయిలో కౌంటర్లు ఏర్పాటు చేసి రైతుల ఫిర్యాదులను స్వీకరించారు. అధికారులు గ్రామాలకు వెళ్లి రైతుల వివరాలు సేకరించి, స్పెషల్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఇప్పటికే 50% సర్వే పూర్తయిందని, త్వరలోనే ఆ రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని వ్యవసాయశాఖ ప్రకటించింది. కొందరు వ్యవసాయ అధికారులు రైతుల నుంచి దరఖాస్తు ప్రాసెస్ చేయడానికి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రైతుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు నిరూపితమైతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.