Nayab Singh Saini: హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ
హర్యానాలో బీజేపీ-జేజేపీ కూటమి విచ్ఛిన్నమైన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే హర్యానా సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయగా.. కొత్త సీఎంగా నాయబ్ సింగ్ సైనీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన పేరుపై ఏకాభిప్రాయం కుదిరింది. నాయబ్ సైనీ ఓబీసీ నాయకుడు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలో సైనీని ముందు పెట్టి.. బీజేపీ బీసీ నినాదంతో వెళ్లాలని చూస్తోంది. ఇదే సమయంలో మనోహర్ లాల్ ఖట్టర్‌ను కర్నాల్ లోక్‍సభ స్థానం బీజేపీ బరిలో దింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత ఖట్టర్‌ను కేంద్రమంత్రి పదవిని కట్టబెట్టే అవకాశం ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
నాయబ్ సైనీ ప్రస్థానం ఇదీ
నాయబ్ సైనీ ప్రస్తుతం హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. 2019లో కురుక్షేత్ర స్థానం నుంచి లోక్‌సభ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. నాయబ్ సైనీ 2002 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో నారాయణగఢ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, 2016లో హర్యానా ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 3 ఏళ్ల తర్వాత 2019లో కురుక్షేత్ర నుంచి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేలా చేసింది. హర్యానా కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకార కార్యక్రమం మంగళవారం సాయంత్రం 5 గంటలకు జరగనుంది. ముఖ్యమంత్రితో పాటు కొత్త మంత్రివర్గం కూడా ఏర్పాటు కానుంది.