
Pema Khandu: తదుపరి దలైలామా ప్రజాస్వామ్య దేశం నుంచే వస్తారు: పెమా ఖండూ
ఈ వార్తాకథనం ఏంటి
టిబెటన్ బౌద్ధ మతంలో కీలకమైన దలైలామా వారసత్వ అంశం ప్రస్తుతం భారత్-చైనా మధ్య వివాదానికి దారి తీస్తోంది. 14వ దలైలామా తరుపరి వారసుడి ఎంపికపై చర్చ తీవ్రంగా కొనసాగుతున్న వేళ, చైనా ప్రభుత్వం తమ చట్టాలు, సార్వభౌమాధికారానికి అనుగుణంగానే తదుపరి దలైలామా ఉండాలని స్పష్టం చేసింది. అయితే, భారత కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ తదుపరి దలైలామాను ఎంచుకునే అధికారం ఒక్క దలైలామాకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన చైనా, భారత్ ఈ అంశంలో దూరంగా ఉండాలని కోరింది. కానీ ఈ వివాదంపై తాజాగా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Details
దలైలామా వారసుడు ప్రజాస్వామ్య దేశం నుంచే వస్తారు
తదుపరి దలైలామా ఖచ్చితంగా ప్రజాస్వామ్య దేశం నుంచే వస్తారని పెమా ఖండూ చెప్పారు. , చైనా నుంచి రాడని స్పష్టం చేశారు. ఆయన మరణించిన తర్వాతే ఆ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. అలాగే, ప్రస్తుతం ఉన్న 14వ దలైలామా ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొంటూ ఈసారి ఆయన 90వ జన్మదిన వేడుకల్లో మాట్లాడుతూ, 130 ఏళ్ల వరకు జీవిస్తానన్నారు. అందుకే మనమంతా ఆయన దీర్ఘాయుష్షుతో ఉండాలని ప్రార్థిస్తున్నామని అన్నారు.
Details
దలైలామా వ్యవస్థపై చైనాకు ప్రమేయం లేదు
పెమా ఖండూ మరింతగా స్పష్టంగా అభిప్రాయపడ్డారు. దలైలామా వారసత్వంపై చైనా అభ్యంతరం తెలుపుతున్నదాన్ని నేను అర్థం చేసుకోలేను. ఇది టిబెట్ బౌద్ధ మత పద్ధతుల ప్రకారం జరిగే అంశం. చైనాకు ఇందులో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అలాగే, దలైలామా వ్యవస్థ గత 600 సంవత్సరాలుగా కొనసాగుతోందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న దలైలామా ఇంకా కొన్ని సంవత్సరాలు బతకాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.