మద్యం పాలసీ కేసులో ఆప్ పార్టీ పేరు
దిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుడిగా చేర్చబోతున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేడు సుప్రీంకోర్టుకు తెలియజేయనుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) కేసులో లబ్ధిదారునిగా ఆరోపించబడిన రాజకీయ పార్టీ ఆప్‌ని ఎందుకు నిందితుడిగా చేర్చలేదో స్పష్టం చేయాలని దర్యాప్తు సంస్థను సుప్రీంకోర్టు అడిగిన ఒక రోజు తర్వాత ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. పీఎంఎల్‌ఏ విషయంలో కేసు మొత్తం ఓ రాజకీయ పార్టీకి సంబంధించి ఉందని అయితే ఆ రాజకీయ పార్టీ ఇప్పటికీ నిందితుడు కాదని అలాంటప్పుడు దానిపై ఎటువంటి సమాధానం ఇస్తారని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎస్వీ భట్టిలతో కూడిన ధర్మాసనం సీబీఐ, ఈడీ తరుపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ప్రశ్నించింది.
సిసోడియా దాఖలు చేసిన రెండు పిటిషన్లను విచారించిన కోర్టు
సిబిఐ,ఈడి దర్యాప్తు చేస్తున్న కేసుల్లో తనకు బెయిల్‌ను నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సవాలు చేస్తూ సిసోడియా దాఖలు చేసిన రెండు పిటిషన్లను కోర్టు విచారించింది. క్యాబినెట్ నోట్స్,నిర్ణయాల న్యాయబద్ధతపై కోర్టుకు తెలియజేయాలని కూడా బెంచ్ ASG రాజును కోరింది. ఢిల్లీ మద్యం పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆప్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఢిల్లీ నివాసంలో 10 గంటలకు పైగా విచారించిన తర్వాత బుధవారం ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.
ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు: అతిషి
ఈ పరిణామంపై ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి స్పందిస్తూ, 'మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లపై ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. అందుకే, ఈ కేసులో ఆప్ పార్టీని నిందితులుగా చేయాలని వారు భావిస్తున్నారని అన్నారు. 15 నెలల విచారణ తర్వాత కూడా సిసోడియా, సింగ్‌లపై ఎలాంటి ఆధారాలు లేవని, ఇది కేవలం ఈడీ చేస్తున్న ఆరోపణలే అని ఆమె ఆరోపించారు.