Amit Shah: 'ది సబర్మతి రిపోర్ట్' నిజాలను ధైర్యంగా బయటపెట్టింది.. అమిత్ షా ప్రశంసలు
ఇటీవల విడుదలైన 'ది సబర్మతి రిపోర్ట్' చిత్రాన్నికేంద్ర మంత్రి అమిత్ షా పొగడ్తలతో ముంచెత్తారు. సోమవారం ఎక్స్‌లో ఆయన చేసిన ఓ పోస్టు చేశారు. 2002 నాటి గోద్రా రైలు దహనం ఘటన వెనుకున్న నిజాన్ని ధైర్యంగా బయటపెట్టారని పేర్కొన్నారు. ఎవరెంత ప్రయత్నించినా, సత్యాన్ని ఎప్పటికీ దాచలేరని ఆయన వ్యాఖ్యానించారు. చీకటిలో దాగున్న విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారని ప్రశంసించారు. ఈ చిత్రంపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రశంసలు కురిపించాడు. నిజం బయటపడుతోందని ఆయన పేర్కొన్నారు. సినిమా తనకు మంచి అనుభూతి కలిగించిందన్నారు. ధీరజ్ సర్నా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో విక్రాంత్ మాస్సే, రాశి ఖన్నా నటించారు.
మూడ్రోజుల్లో రూ.6.35 కోట్లు వసూలు
2002లో గుజరాత్‌లో గోద్రా స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగి 59 మంది హిందువులు మరణించారు. ఈ ఘటనకు ముస్లిం గుంపు కారణమని ప్రాథమికంగా నమ్మినా, ఆ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని కొందరు వాదించారు. ఈ దుర్ఘటన గుజరాత్‌లో ఘోర అల్లర్లకు దారితీసి, వేలమందిని పొట్టనబెట్టుకుంది. నవంబర్ 17న విడుదలైన ఈ చిత్రం ప్రారంభంలో బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించకపోయినా, ప్రధానమంత్రి సహా ఇతర ప్రముఖుల ప్రశంసలతో వసూళ్లు గణనీయంగా పెరిగాయి. మొదటి మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 6.35 కోట్లు రాబట్టింది.