America : అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన రెండో విమానం.. ఈసారి 116 మంది వలసదారులు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా నుంచి 116 మంది అక్రమ వలసదారులతో ప్రయాణిస్తున్న విమానం శనివారం రాత్రి అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది.
అక్రమ వలసలను అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన భారతీయులను బహిష్కరిస్తున్న రెండవ బ్యాచ్ ఇదే.
విమానం రాత్రి 10 గంటలకు ల్యాండ్ అవుతుందని భావించినా, చివరికి రాత్రి 11:30 గంటలకు దిగిందని అధికారులు వెల్లడించారు.
బహిష్కరించిన వారు సంకెళ్ళు ధరించారా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు.
ఫిబ్రవరి 5న తొలి బ్యాచ్‌లో అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపిన తర్వాత, ఇప్పుడు బహిష్కరించిన వారిలో ఎక్కువ మంది పంజాబ్‌కు చెందిన వారు.
Details
పంజాబ్ కు చెందిన వారు ఎక్కువమంది
మొదట ఈ బ్యాచ్‌లో 119 మంది ఉంటారని అంచనా వేసినా, చివరికి 116 మంది మాత్రమే ఉన్నట్లు అధికారులు తెలిపారు.
వారిలో 65 మంది పంజాబ్‌కు, 33 మంది హర్యానాకు, 8 మంది గుజరాత్‌కు, ఉత్తరప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్‌లకు ఇద్దరు చొప్పున, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లకు ఒక్కొక్కరు చెందినవారు.
వీరిలో ఎక్కువ మంది 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలవారు.
కొంతమంది బహిష్కృతులను రిసీవ్ చేసుకునేందుకు వారి కుటుంబసభ్యులు విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఇక 157 మంది వలసదారులతో కూడిన మూడో బ్యాచ్ ఫిబ్రవరి 16న భారతదేశానికి చేరుకోనుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
Details
అక్రమ మార్గాల్లో తీసుకెళ్లారు
ఫిబ్రవరి 5న 104 మంది భారతీయ అక్రమ వలసదారులతో అమెరికన్ సైనిక విమానం అమృత్‌సర్ విమానాశ్రయంలో ల్యాండ్ కాగా, వారిలో 33 మంది హర్యానా, గుజరాత్‌కు చెందినవారు, 30 మంది పంజాబ్‌కు చెందినవారు.
బహిష్కరించిన వారి బంధువులు మాట్లాడుతూ, మెరుగైన భవిష్యత్తు కోసం విదేశాలకు పంపేందుకు తమ వ్యవసాయ భూములను, పశువులను తాకట్టు పెట్టి డబ్బు సేకరించామని వాపోయారు.
హోషియార్‌పూర్ జిల్లాలోని తాండా ప్రాంతానికి చెందిన దల్జిత్ సింగ్ కుటుంబం ఒక ట్రావెల్ ఏజెంట్ చేతిలో మోసపోయిందని ఆరోపించింది.
దల్జిత్ భార్య కమల్‌ప్రీత్ కౌర్, తన భర్తను ట్రావెల్ ఏజెంట్ నేరుగా విమానంలో అమెరికాకు పంపిస్తానని చెప్పి, అక్రమ మార్గాల్లో తీసుకెళ్లారని తెలిపారు.