Page Loader
Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు!
ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు!

Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 20, 2025
06:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను రూపొందిస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో బీమా విధానంలో ఆరోగ్య శ్రీ సేవలు అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల విలువైన వైద్య సేవలు అందించే ప్రతిపాదనలపై పని జరుగుతోంది. ప్రస్తుతానికి బీపీఎల్ కుటుంబాలకే ఈ సేవలు అందుతున్నప్పటికీ, భవిష్యత్తులో ఏపీఎల్ కుటుంబాలకు కూడా ఈ పథకాన్ని విస్తరించేందుకు ప్రభుత్వ ఆలోచనలో ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది.

Details

దారిద్య్ర రేఖకు దిగువన 1.43 కోట్ల కుటుంబాలు

ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఈ ఆరోగ్య బీమా సేవలు ఉచితంగా అందించేందుకు ముసాయిదాను ఆరోగ్యశాఖ రూపొందించగా, ఆర్థిక శాఖ ఈ ప్రతిపాదనల సాధ్యతను పరిశీలిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన 1.43 కోట్ల కుటుంబాలు ఉన్నాయని అధికారికంగా అంచనా. వీరికి ఇప్పటికే ఉచితంగా పథకాలు అమలవుతున్నాయి. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఈహెచ్‌ఎస్‌ (Employees Health Scheme) మాదిరిగానే, దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న ప్రైవేట్ ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు దాదాపు 19-20 లక్షల కుటుంబాలకు కూడా ఈ బీమా వర్తింపజేస్తారు.

Details

బీమా విధానంలో 2,250 రకాల చికిత్సలు

ఆదాయ ప్రమాణం లేకుండా అందరికీ ఈ సేవల విస్తరణపై దృష్టి సారించారు. కొత్త పథకం ప్రకారం, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.2.5 లక్షల వరకు బీమా కంపెనీల ద్వారా వైద్య సేవలు ఉచితంగా అందిస్తారు. రూ.2.5 లక్షలు మించిన చికిత్సల ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు "హైబ్రిడ్ మోడల్" ద్వారా మద్దతు ఇస్తుంది. మొత్తం రూ.25 లక్షల వరకు సేవలు అందుబాటులో ఉండేలా చేస్తారు. ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఇప్పటికే ఏడాదికి రూ.25 లక్షల విలువైన చికిత్సలు ఉచితంగా లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం బీమా విధానంలో 2,250 రకాల చికిత్సలు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా 770 చికిత్సలు అందిస్తున్నారు.

Details

సీఎం ఆమోదం అనంతరం టెండర్లు

మొత్తం 3,257 రకాల చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయి. అయితే ట్రస్ట్ ద్వారా అందించే 770 చికిత్సలు అత్యవసరమైనవిగా లేవన్న కారణంతో ఆర్థిక భారం తగ్గించేందుకు వీటిని ప్రత్యేకంగా ట్రస్ట్‌ పరిధిలోనే ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అసుపత్రుల అభ్యంతరాలు, చికిత్సల ఖర్చులపై సమగ్ర అధ్యయనం అనంతరం ముఖ్యమంత్రి ఆమోదం అనంతరం టెండర్లు ఆహ్వానించే దిశగా వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. నెట్‌వర్క్ ఆసుపత్రులు మాత్రం ప్రస్తుతం బీమా మోడల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆరోగ్యశ్రీ ప్యాకేజీల రేట్లను సవరించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే, దేశంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా సేవల నమూనాగా ఏపీ రాష్ట్రం నిలవనుంది.