
Hyderabad: భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం.. ప్రాణ, ఆస్తి నష్టం!
ఈ వార్తాకథనం ఏంటి
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. గురువారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని అనేక కాలనీలు మురుగు నీటితో నిండిపోయాయి.
పలు బస్తీల్లో రహదారులు కొట్టుకుపోయాయి. లింగంపల్లి అండర్‌పాస్ వద్ద భారీగా వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
నాలాలు పొంగిప్రవహించాయి, రహదారులు చెరువులను తలపించాయి.
మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా ఈదురుగాలులతో ప్రారంభమైన వర్షం ఉరుములు, మెరుపులు, పిడుగులతో మరింత తీవ్రత ఏర్పరచింది, దీంతో నగరంలోని జనజీవనం స్థంభించింది.
Details
పాక్షికంగా దెబ్బతిన్న చార్మినార్
ఎల్బీనగర్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, నారాయణగూడ నుంచి రాష్ట్ర సచివాలయం, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వరదనీరు రహదారులను ఆక్రమించింది.
వాహనాల రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి. ఖైరతాబాద్, ఆనందనగర్, దిల్‌సుఖ్‌నగర్, రామ్‌నగర్ తదితర ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి.
కొన్ని చోట్ల చెట్లు కార్లపై పడగా, అందులో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చెట్ల కొమ్మలు విరిగిపడటంతో అనేక చోట్ల విద్యుత్తు స్తంభాలు దెబ్బతిన్నాయి.
నగరంలో వర్షం ధాటికి చారిత్రక కట్టడం చార్మినార్ పాక్షికంగా దెబ్బతింది. భాగ్యలక్ష్మి దేవాలయం వైపు ఉన్న మినార్ పైభాగం నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి.
అదృష్టవశాత్తూ, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Details
నాగర్ కర్నూల్ జిల్లాలో ఇద్దరు మృతి
నాలుగేళ్ల కిందట మరమ్మతులు చేపట్టిన ప్రాంతంలోనే మళ్లీ నష్టం వాటిల్లిందని అధికారులు గుర్తించారు. ఈ భారీ వర్షాల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు.
నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం కోడోనిపల్లెలో పొలంలో పనిచేస్తున్న గాజుల వీరమ్మ (60), సుంకరి సైదమ్మ (45)లు పిడుగుపాటుకు బలయ్యారు.
మరొకరు గాయపడగా, అతనికి చికిత్స అందించారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చంద్రశేఖర్‌నగర్‌కు చెందిన బోయ చిన్నవెంకటేశ్వర్లు (41) పశువులను మేపడానికి వెళ్లి పిడుగుపాటుకు గురై మృతి చెందారు.
ఇదే జిల్లాలో వడ్డేపల్లి మండలం బుడమర్సు గ్రామానికి చెందిన మహేంద్ర (19) పశువులను తోలుకుని ఇంటికి వస్తుండగా పిడుగుపాటుకు బలయ్యాడు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో గోడకూలి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ ఇమ్మత్‌ఖాన్ (50) మరణించారు.