BRS Symbol Issue: కారు పోలిన గుర్తులపై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించవద్దంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. రోడ్డు రోలర్, చపాతీ మేకర్ వంటి గుర్తులు కారు గుర్తుకు పోలి ఉన్నాయని, దీని వల్ల ఎన్నికల్లో తమకు నష్టం జరుగుతుందని ఎన్నికల సంఘం దృష్టికి బీఆర్ఎస్ తీసుకెళ్లిన విషయం తెలిసిందే. కారు పోలిన గుర్తులను ఎవరికి కేటాయించవద్దని దిల్లీ హైకోర్టులో ఇప్పటికే బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ ఈనెల 12న బీఆర్ఎస్ వెనక్కి తీసుకుంది. సుప్రీంకోర్టులో దాఖలు చేయాలనే ఉద్దేశంతోనే దిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది.
బీఆర్ఎస్ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు
బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం వారి అభ్యర్థను తిరస్కరించింది. జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మసనం బీఆర్ఎస్ వాదనను కొట్టివేసింది. కారు, రోటీ మేకర్ గుర్తులకు తేడా ఓటర్లకు తెలుసు అని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు తాజాగా ఈ పిటిషన్‌ను కొట్టివేయడంతో బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ముననుగోడు ఉన్న ఎన్నికల సమయంలో రోడ్డు రోలర్ గుర్తు కేటాయింపు విషయమై చోటు చేసుకున్న వివాదం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వేటుకు కారణమైంది.