Air Pollution: దిల్లీలో ఆంక్షల సడలింపునకు నో చెప్పిన సుప్రీం కోర్టు.. పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని సూచన
దేశ రాజధాని దిల్లీతో పాటు ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో అధిక స్థాయిలో ఉన్న కాలుష్యాన్ని తగ్గించేందుకు అమలు చేస్తున్న గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 (GRAP-4) ఆంక్షలను సడలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. GRAP-4 అమలుతో నిర్మాణరంగం తీవ్రంగా ప్రభావితమైంది. దీంతో వేలాదిమంది కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో కార్మికులకు ఆర్థిక సాయం అందించేందుకు సెస్‌ను ఉపయోగించాలని ఎన్‌సీఆర్ పరిధిలోని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు సూచించింది. కాలుష్యం వల్ల పాఠశాలలు మూసివేసి ఆన్‌లైన్ విద్యను అమలు చేస్తున్నారు. దీంతో మధ్యాహ్న భోజన పథకం రద్దు కావడం, విద్యార్థులు ఆన్‌లైన్ తరగతుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాలను న్యాయస్థానం గమనించింది.
శ్వాసకోశ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు
విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించే అంశాన్ని పరిశీలించాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM)ను సుప్రీం కోర్టు ఆదేశాలను జారీ చేసింది. దిల్లీలో వాయు నాణ్యత స్వల్పంగా మెరుగుపడినా, చాలాచోట్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 300కు పైగా ఉండటంతో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉంది. కాలుష్యంతో ప్రజలు శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 12వ తరగతి వరకు పాఠశాలలు మూసివేసి, ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు అనుమతి ఇచ్చారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లొ GRAP-4 అమలు కీలకమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. గాలి నాణ్యత మెరుగయ్యే వరకూ ఆంక్షలను ఎత్తివేసే ప్రసక్తి లేదని పేర్కొంది.