AP Assembly Budget Session 2026 : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు.. పద్దు ప్రవేశపెట్టేది ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 11 నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ శుక్రవారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం కానుంది. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాల అజెండాను ఖరారు చేయడంతో పాటు సభ ఎన్ని రోజులపాటు కొనసాగించాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.
Details
బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారు?
ఫిబ్రవరి 12న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభ్యులు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు మొత్తం ఈ తీర్మానంపై చర్చ జరుగనుంది. ఫిబ్రవరి 14న బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకురావొచ్చని సమాచారం. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 3న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఫిబ్రవరి 2లోగా తమ ప్రతిపాదనలను పంపించాలని అన్ని శాఖల అధికారులకు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, బడ్జెట్ రూపకల్పనతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
Details
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
మరోవైపు కేంద్ర పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు ఆదివారం అయినప్పటికీ లోక్‌సభ సమావేశం కానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సభకు సమర్పించనున్నారు.
Details
వైద్య కళాశాలల నిర్మాణంపై కీలక చర్చ
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయించిన నిధులు, భవిష్యత్‌లో వచ్చే నిధులపై స్పష్టత రావడంతో రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనకు ఇది దోహదపడనుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర పద్దును సిద్ధం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురావచ్చని తెలుస్తోంది. ఇప్పటికే జరిగిన కేబినెట్ సమావేశాల్లో అనేక నిర్ణయాలకు ఆమోదం లభించగా, వాటిలో కొన్ని శాసనసభ ఆమోదం అవసరం. అలాగే సంక్షేమ పథకాలు, నిధుల కేటాయింపులు, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత చర్చ జరగనుంది. పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణంపై కూడా కీలకంగా చర్చ జరిగే అవకాశముంది.
Details
వైసీపీ సభ్యుల హజరుపై ఉత్కంఠ
ఇక రాజకీయంగా మరో కీలక అంశంపై చర్చ జరుగుతోంది. ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరవుతారా? లేక గతంలో మాదిరిగానే సభకు దూరంగా ఉంటారా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. వరుసగా సభకు గైర్హాజరవుతున్న ఎమ్మెల్యేలపై వేటు వేయాలన్న డిమాండ్‌ను అధికార పక్షం ప్రస్తావిస్తోంది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా పలుమార్లు ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ సభకు రాకుండా ఉండటంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేల వైఖరి ఏమిటన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.
Details
అత్యంత కీలకంగా బడ్జెట్ సమావేశాలు
మరోవైపు కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంశాల వారీగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందంటూ పలుమార్లు నిలదీశారు. ప్రతిపక్ష హోదా ఇస్తే సభలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే తనకు ఆ హోదా ఇవ్వడం లేదని జగన్ ఆరోపించారు. ఈ అన్ని పరిణామాల మధ్య ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాజకీయంగా అత్యంత కీలకంగా మారనున్నాయి.