Krishna Board: శ్రీశైలం, సాగర్‌లో ఉన్న నీరు పూర్తిగా మాదే.. తెలంగాణ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో ఉన్న నీరు తమకే దక్కుతాయని పేర్కొంది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తన వాటాకు మించి నీటిని వినియోగించుకుందని, ఈ పరిస్థితుల్లో కృష్ణా బోర్డు చర్యలు తీసుకోవాలని కోరింది.
రెండు రిజర్వాయర్ల నుంచి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ నీటిని ఉపయోగిస్తుండటం ఆశ్చర్యకరమని తెలంగాణ నీటిపారుదల శాఖ బుధవారం బోర్డుకు లేఖ రాసింది.
Details
నీటి పంపిణీపై వివాదం
జనవరి చివర్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌కు 66% వాటా (666.68 టీఎంసీలు), తెలంగాణకు 34% వాటా (343.446 టీఎంసీలు) కేటాయించినట్లు బోర్డు తెలిపింది.
ఫిబ్రవరి 11 వరకు నీటి వినియోగాన్ని లెక్కించగా, ఆంధ్రప్రదేశ్‌కు 27.03 టీఎంసీలు, తెలంగాణకు 131.75 టీఎంసీలు మిగిలి ఉన్నట్లు లేఖలో పేర్కొంది.
అయితే ఫిబ్రవరి 11 నాటికి సాగర్‌లో 63.6 టీఎంసీలు, శ్రీశైలంలో 30.8 టీఎంసీలు మాత్రమే ఉండగా, మొత్తం రెండు రిజర్వాయర్లలో 94.4 టీఎంసీలే మిగిలాయని వెల్లడించింది.
అయితే రాష్ట్రాలకు కలిపి 158.78 టీఎంసీల అవసరం ఉందని, ఇది ఎలా సాధ్యమవుతుందో బోర్డు వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రశ్నించింది.
Details
నీటి వినియోగంపై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం
తెలంగాణ అభిప్రాయం ప్రకారం, ఉమ్మడి రిజర్వాయర్లైన శ్రీశైలం, సాగర్‌ల నుంచి నీరు తీసుకోవడం అనుచితమని, తుంగభద్ర, సుంకేశుల, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, గాజుల దిన్నెలో ఉన్న 51.756 టీఎంసీల నీటి నుండి ఆంధ్రప్రదేశ్ 27.03 టీఎంసీలు వినియోగించుకోవాలని సూచించింది.
కానీ శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుండి నీటిని అధికంగా తీసుకోవడం వల్లనే ఇప్పుడు నీటి కొరత ఏర్పడిందని ఆరోపించింది.
ఫిబ్రవరి 18 నాటికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి 36.67 టీఎంసీలు అధికంగా వినియోగించిందని వివరించింది.
అంతేకాకుండా సాగర్ కుడి కాలువ ద్వారా రోజూ 10,000 క్యూసెక్కుల నీరు, శ్రీశైలం నుండి 1.5 టీఎంసీల నీటిని తీసుకుంటున్నందున, వెంటనే నిలిపివేయాలని తెలంగాణ బోర్డును కోరింది.
Details
శ్రీశైలం ప్లంజ్‌పూల్‌పై ఆందోళన
శ్రీశైలం డ్యామ్‌కి సంబంధించిన ప్లంజ్‌పూల్ వద్ద పరిస్థితి తీవ్రంగా ఉందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది.
నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథార్టీ లేఖ రాసింది.
విద్యుత్ ఉత్పత్తి, సాగు, తాగు నీటి సరఫరా, వరద నియంత్రణ కోసం శ్రీశైలం రిజర్వాయర్ కీలకమైనదని, అయితే ప్రస్తుత పరిస్థితి మెరుగుపడకపోతే డ్యాంకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించింది.
నిపుణులను వెంటనే పంపించి తాత్కాలిక చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎన్డీఎస్‌ఏను కోరింది.