S. Jaishankar: అగాధం అంచున ప్రపంచం.. జైశంకర్ సంచలన హెచ్చరిక!
ఈ వార్తాకథనం ఏంటి
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S. Jaishankar) ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రపంచ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచం ప్రస్తుతం అగాధం అంచున ఉందని ఆయన హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థ, మార్కెట్ ప్రవేశం, సరఫరా గొలుసులు, సాంకేతికత సహా ప్రతిదీ ఆయుధంగా మారుతున్న పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. శాంతి, భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు అన్ని దేశాలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశంలో జరిగిన సాధారణ చర్చలో జైశంకర్ ప్రసంగించారు. ఎనిమిది దశాబ్దాలు గడిచినప్పటికీ ప్రపంచంలో స్థిరత్వం, భద్రత, విశ్వసనీయతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
వివరాలు
ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి
ఆర్థిక వనరులు, అనుసంధాన వ్యవస్థలు కూడా ఆయా దేశాల ప్రయోజనాల కోసం ఒత్తిడి సాధనాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశాలు తమకు ఎదురయ్యే ప్రమాదాలను తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయని జైశంకర్ తెలిపారు.
ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆహారం, ఇంధనం, ఎరువులు, ఆర్థిక వనరుల కొరతతో కూడిన నాలుగు రకాల సంక్షోభాలను ఒకేసారి ఎదుర్కొంటున్నాయని వివరించారు.
ఎల్‌నినో ప్రభావం తీవ్రతరం కావడం, ఎరువుల కొరత, ధాన్యం రవాణాలో ఏర్పడుతున్న అవరోధాలు ప్రపంచ పరిస్థితులను మరింత ఆందోళనకరంగా మారుస్తున్నాయని జైశంకర్ చెప్పారు.
ఈ పరిణామాల కారణంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంపై కూడా ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్నారు. ఇదేసమయంలో ఉగ్రవాదంపై కూడా జైశంకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు
పాకిస్థాన్‌ను నేరుగా పేరుపెట్టకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఉగ్రవాదాన్ని నిరంతరం ప్రోత్సహించే వారు వాస్తవాలను వక్రీకరించడంతో పాటు ఉగ్రవాదాన్ని సాధారణీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తనను తాను రక్షించుకునే హక్కును వినియోగించుకుంటుందని జైశంకర్ స్పష్టం చేశారు. స్నేహం, సౌహార్దం, ఉగ్రవాదం ఒకేసారి కొనసాగలేవని తేల్చిచెప్పారు. సరిహద్దులు దాటి జరిగే ప్రభుత్వ ప్రోత్సాహిత ఉగ్రవాదం ప్రపంచ వ్యవస్థకు ప్రత్యక్ష సవాలు అని పేర్కొన్నారు.
అలాంటి చర్యలకు పాల్పడే ప్రభుత్వాలను బాధ్యులను చేయాల్సిన అవసరం ఉందని జైశంకర్ అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.
శాంతి, భద్రత, స్థిరత్వం కోసం దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో స్పష్టమైన వైఖరిని అవలంబించాల్సిన అవసరం ఉందని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.