
Raj Bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ కలకలం.. హార్డ్‌డిస్క్‌లు అపహరించిన నిందితుడు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాజ్‌భవన్‌లో చోటు చేసుకున్న చోరీ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో రాజకీయ వర్గాల్లోనూ, భద్రతా వ్యవస్థలలోనూ కలకలం రేపుతోంది. రాజ్‌భవన్ పరిధిలోని సుధర్మ భవన్‌లో నాలుగు హార్డ్ డిస్క్‌లు చోరీకి గురైన ఘటన ఈ నెల 14న రాత్రి చోటు చేసుకుంది. చోరీని మొదటి అంతస్తులోని గదిలో జరిపినట్లు సీసీటీవీ ఫుటేజుల ద్వారా గుర్తించారు. కంప్యూటర్ రూంలోకి హెల్మెట్ ధరించి ప్రవేశించిన వ్యక్తి హార్డ్ డిస్క్‌లను అపహరించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఇందులో రాజ్‌భవన్ సంబంధిత పరిపాలన వివరాలు, కీలక ఫైళ్ళు, సున్నితమైన సమాచారం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రాజ్‌భవన్ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Details
నిందితుడిని రిమాండ్ కు తరలించిన పోలీసులు
సీసీ కెమెరా దృశ్యాలు, సిబ్బంది విచారణల ద్వారా నిందితుడిగా పనిచేసే కంప్యూటర్ హార్డ్‌వేర్ ఇంజినీర్ శ్రీనివాస్‌ను గుర్తించారు. ఆయనే హార్డ్ డిస్క్‌లను చోరీ చేసినట్లు నిర్ధారణకు వచ్చి అరెస్టు చేశారు. పోలీసులు శ్రీనివాస్‌ను రిమాండ్‌కు తరలించి, అతని వద్ద నుండి చోరీకి గురైన హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిత్యం హై సెక్యూరిటీ నిఘా, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండే రాజ్‌భవన్‌లో ఈ విధమైన చోరీ జరగడంపై అనేక ప్రశ్నలు తలెత్తిస్తోంది. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ చేపట్టే విధంగా అధికారులు సూచనలు ఇచ్చినట్లు సమాచారం. భద్రతా లోపాలను గుర్తించి, తదుపరి ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకునే దిశగా పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.