
Andhra pradesh: ఏపీలో థీమ్ బేస్డ్ పట్టణాలు..విశాఖలో సిద్ధమవుతున్న వెయ్యి ఎకరాలు
ఈ వార్తాకథనం ఏంటి
నగరాల్లో జనాభా నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో,భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ క్రమంలో నగరాల పరిసర ప్రాంతాల్లో కొత్త పట్టణ నిర్మాణాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా,నీతి ఆయోగ్ ఎంపిక చేసిన గ్రోత్ సిటీల్లో ఒకటైన విశాఖపట్టణంలో 'థీమ్ బేస్డ్' పట్టణాల నిర్మాణానికి ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. ఇందుకోసం వెయ్యి ఎకరాల భూమిని సేకరించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఇదే తరహా నమూనాను ఇతర ప్రధాన నగరాల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం సుమారు 1,500 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూములను అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
వివరాలు
థీమ్ బేస్డ్ పట్టణాల ఉద్దేశ్యం
ఈ ప్రాంతాల్లో కల్పించాల్సిన సదుపాయాలు, అమలు చేయాల్సిన ప్రాజెక్టులపై రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాలు,ఆస్తుల నిర్వహణ సంస్థ(APUIAML)సమగ్ర అధ్యయనం చేస్తోంది. విశాఖపట్నం జనాభా 2011 గణాంకాల ప్రకారం 18లక్షలుగా ఉండగా,ప్రస్తుతం అది 21లక్షలకు పైగా పెరిగిందని అంచనా. రాబోయే సంవత్సరాల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నందున, విశాఖ పరిసర ప్రాంతాల్లోని అనకాపల్లి, విజయనగరం వంటి పట్టణాల్లో స్థిరమైన,వినూత్న రీతిలో థీమ్ ఆధారిత పట్టణాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పట్టణాల్లో మౌలిక వసతులను ఏర్పాటు చేసి, ఐటీ, వైద్యం, పర్యాటకం, వినోదం, వాణిజ్యం, పరిశ్రమలు వంటి విభిన్న రంగాల్లో ప్రైవేట్ సంస్థల నుంచి పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే విజయనగరం, అనకాపల్లి,విశాఖపట్నం జిల్లాల్లో 1,000 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూములను గుర్తించారు.
వివరాలు
తొలి దశలో ఆరు నగరాలు
ప్రైవేట్ భూముల విషయంలో భూసమీకరణ పథకం అమలు చేయాలని నిర్ణయించారు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు, కడప, శ్రీకాకుళం నగరాల పరిసర ప్రాంతాల్లో కూడా థీమ్ బేస్డ్ పట్టణాల నిర్మాణానికి ల్యాండ్ బ్యాంక్ సిద్ధం చేస్తున్నారు. ఈ 12 నగరాల్లో కలిపి 1,500 ఎకరాల భూమిని గుర్తించారు. వీటిలో ప్రభుత్వ, ప్రైవేట్ భూములు రెండూ ఉన్నాయి. మొదటి దశలో విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, కర్నూలు నగరాల్లో థీమ్ బేస్డ్ పట్టణ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. దీనికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు, కొంత భూమిని పట్టణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో లేఔట్లు వేసి ప్రజలకు విక్రయించే అవకాశం ఉంది.
వివరాలు
పెట్టుబడులు, కేంద్ర సహకారం
ఐటీ, పర్యాటకం,వినోదం వంటి ప్రాజెక్టులకు ప్రైవేట్ సంస్థలకు భూములను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు 'అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్' కింద నిధులను పొందేందుకు రాష్ట్ర అధికారులు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపారు. నగరాల్లో మౌలిక వసతుల కల్పన రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారినందున,ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ కింద రూ.లక్ష కోట్లు కేటాయించారు. ఆ నిధులలో భాగంగా ఏపీ ప్రభుత్వం రూ.10 వేల కోట్లకు పైగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ నిధులు ఆమోదం పొందితే, రాష్ట్రంలో థీమ్ బేస్డ్ పట్టణాల నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగే అవకాశం ఉందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు.