
Air India Pilots Association: సాంకేతిక లోపాలు ఉన్నాయి.. పైలెట్లపై ఒత్తిడి తగదు : పైలెట్ల అసోసియేషన్
ఈ వార్తాకథనం ఏంటి
అహ్మదాబాద్‌లో జూన్ 12న చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై పైలట్ల సంఘం తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి విడుదలైన ప్రాథమిక నివేదికపై ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ALPA India) తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. ఈ నివేదికలో పైలట్లే ప్రమాదానికి బాధ్యులని సూచించడం పట్ల సంఘం అసంతృప్తిని వెల్లడించింది. ఈ దుర్ఘటనలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోగా కేవలం ఒకరే ప్రాణాలతో బయటపడటం గమనార్హం. ప్రమాదం జరిగిన విమానం ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ గాట్విక్‌కు బయలుదేరిన కొద్ది సేపటికే కుప్పకూలింది.
Details
ప్రాథమిక నివేదిక వివరాలు
భారతదేశ విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ ఏఎఐబీ (Aircraft Accident Investigation Bureau) విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం, టేకాఫ్ సమయంలో ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయిందని తేలింది. ఈ సమయంలో ఒక పైలట్ మరొకరిని 'ఎందుకు ఇంధనాన్ని కట్ చేశావు? అని ప్రశ్నించగా, నేను ఆఫ్ చేయలేదు అనే జవాబు రికార్డైందని కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ ఆధారంగా నివేదిక తెలిపింది.
Details
పైలట్ల సంఘం అభిప్రాయం
ఈ నివేదికపై ALPA India స్పందిస్తూ, దర్యాప్తు పారదర్శకతతో లేకుండా, పైలట్ల అభిప్రాయాలు తీసుకోకుండా ముమ్మాటికీ పక్షపాతంగా ఉన్నట్లు వ్యాఖ్యానించింది. ప్రమాద దర్యాప్తులో పైలట్లను పరిశీలకులుగా చేర్చాలనే డిమాండ్‌ను కూడా సంఘం ముందుంచింది. మిశ్రమమైన అర్థం లేని ఊహాగానాలపై స్పందిస్తూ మీడియా వాదనలను ఖండించింది.
Details
మంత్రి స్పందన
ఈ విషయంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు స్పందిస్తూ, ఇది కేవలం ప్రాథమిక నివేదిక మాత్రమేనని, తుది నివేదిక వచ్చేవరకు ఎవరినీ నిందించడం సముచితముకాదని స్పష్టం చేశారు. విమాన నిపుణుల అభిప్రాయం ప్రకారం బోయింగ్ 787-8 మోడల్‌లో ఉండే ఇంధన స్విచ్‌లు అనుకోకుండా ఆఫ్ చేయడం చాలా కష్టమైన పని. వాటిని మారుస్తే కచ్చితంగా ఉద్దేశపూర్వక చర్యే కావాలని భావిస్తున్నారు. అయినప్పటికీ, ఈ స్విచ్‌లు ఎందుకు 'కట్‌ఆఫ్' స్థితిలోకి మారాయి? అనే అంశంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. పైలట్ల సంఘం అభిప్రాయం ప్రకారం, ప్రమాదానికి సాంకేతిక లోపాలు, మానవ తప్పిదం కాకుండా ఇతర కారకాలు కూడా ఉండొచ్చు. కనుక వాటినీ దర్యాప్తులో పరిగణలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు.