
Delhi: సీఎన్‌జీ ఆటోలపై నిషేధం లేదు.. తప్పుడు వార్తలను నమ్మవద్దు: దిల్లీ మంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో సీఎన్‌జీ ఆటో రిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయనున్నారన్న వార్తలపై రవాణా శాఖ మంత్రి పంకజ్ కుమార్ సింగ్ స్పందించారు.
సీఎన్‌జీ ఆటోలపై నిషేధం విధిస్తామన్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు.
పౌరులకు మెరుగైన రవాణా సేవలను అందించేందుకు దిల్లీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అయితే సీఎన్‌జీ ఆటో రిక్షాలను నిషేధించే ఉద్దేశ్యం తమకు లేదని ఆయన వెల్లడించారు.
ఈ విషయంలో వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని పేర్కొన్నారు. దిల్లీలో ఏ రకమైన ఆటోరిక్షాలను కూడా నిలిపివేయడంపై ప్రభుత్వం ఆలోచన చేయడం లేదని మంత్రి స్పష్టం చేశారు.
Details
తప్పుడు కథనాలను నమ్మొద్దు
ప్రస్తుతం కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానం ముసాయిదా దశలో ఉందని ఆయన తెలిపారు.
అయితే ఈ నేపథ్యంలో సీఎన్‌జీ ఆటోలపై నిషేధం ఉంటుందనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో మంత్రి ఈ అంశంపై స్పందించాల్సి వచ్చింది.
ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని మంత్రి పంకజ్ కుమార్ సింగ్ అన్నారు. ప్రజలు అలాంటి తప్పుడు కథనాలను నమ్మకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇక కొత్త ఈవీ పాలసీపై దిల్లీ మంత్రివర్గం మంగళవారం సుదీర్ఘంగా చర్చించిందని అధికారులు తెలిపారు.
తాజా విధానం తుది రూపం దాల్చేవరకు, ప్రస్తుతం అమలులో ఉన్న పాత విధానాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.