Page Loader
PM Modi:  పాక్‌తో మధ్యవర్తిత్వం చర్చలకూ చోటు లేదు.. అమెరికా పాత్రపై మోదీ క్లారిటీ!
మధ్యవర్తిత్వం చర్చలకూ చోటు లేదు.. అమెరికా పాత్రపై మోదీ క్లారిటీ!

PM Modi:  పాక్‌తో మధ్యవర్తిత్వం చర్చలకూ చోటు లేదు.. అమెరికా పాత్రపై మోదీ క్లారిటీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 18, 2025
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-పాకిస్తాన్ మధ్య యుద్దాన్ని ఆపానంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది. విపక్షాలు సైతం ట్రంప్ ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందన కోరాయి. ఇక, ఈ వ్యవహారంపై తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారత్-పాక్ మధ్య ఏ ఒప్పందమైనా అమెరికా పాత్ర లేదని ప్రధాని స్పష్టంగా పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడికి ఈ విషయాన్ని తెలియజేశారని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. జీ7 సమ్మిట్ సందర్భంగా మోదీ-ట్రంప్ భేటీ జరగాల్సి ఉన్నప్పటికీ, ట్రంప్ ముందే వెళ్లిపోవడంతో భేటీ కుదరకపోయిందని తెలిపారు. అయితే, అనంతరం ఫోన్‌లో వీరిద్దరూ సుమారు 35 నిమిషాల పాటు మాట్లాడుకున్నారని వివరించారు.

Details

ఆపరేషన్ సిందూర్ పై ట్రంప్‌కు మోదీ వివరణ 

ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత ట్రంప్ మోదీకి ఫోన్ చేసి తన సంతాపం తెలియజేశారని, ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు అండగా ఉంటామని చెప్పారని మిస్రీ పేర్కొన్నారు. ఇదే సందర్భంలో 'ఆపరేషన్ సిందూర్' గురించి మోదీ ట్రంప్‌కు వివరించారని తెలిపారు. ఈ ఆపరేషన్‌ను పాకిస్తాన్ అభ్యర్థన మేరకే నిలిపివేశామని చెప్పారు. మధ్యవర్తిత్వం అస్సలు అవసరం లేదు భారత్ ఎప్పటికీ మూడవ పార్టీ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదని మోదీ స్పష్టంగా పేర్కొన్నట్లు మిస్రీ తెలిపారు. పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి మిలిటరీ స్థాయిలోనే చర్చలు జరిగాయని, అమెరికా ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత్‌లో పూర్తి రాజకీయ ఏకాభిప్రాయం ఉందన్నారు.