Election Rigging: ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది.. ఓటమి తర్వాత ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎట్టకేలకు జన్ సూరజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మౌనం వీడారు. ఎన్నికల్లో ఓటమి ఆయనకు చాలా బాధ కలిగించినట్టు చెప్పారు. ఎన్నికలకు సంబంధించి కొన్ని అంశాలు సరిపోలడం లేదని, ఏదో తప్పు జరిగినట్లు కనిపిస్తోందని తెలిపారు. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని భావిస్తున్నప్పటికీ, దానికి సంబంధించిన ఆధారాలు ప్రస్తుతానికి ఆయన దగ్గర లేవని వెల్లడించారు. ఓడిపోయిన తర్వాత ఎవరూ ఇలాంటి మాటలు చెబుతారని, ఎప్పటికైనా ఆధారాలు బయటకు వస్తాయని అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఆరోపణల ప్రకారం, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి బీహార్‌లోని వేలాది మహిళా ఓటర్లకు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) డబ్బులు పంపిణీ చేసింది.
Details
ఎక్కువమంది డిపాజిట్లు పొందలేకపోయారు
ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 50,000 మంది మహిళలకు రూ. 10,000 అందించడం ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. ఎలక్షన్ ప్రచారం చివరి దాకా జన్ సూరజ్ పార్టీ గెలిచే స్థితిలో లేకపోవడంతో, కొందరు ఓటర్లు అయోమయానికి గురయ్యారని, అందువల్ల లాలూ జంగిల్ రాజ్ సర్కార్ రాకూడదని భావించి ఎన్డీయే కూటమికి సపోర్ట్ ఇచ్చారని పేర్కొన్నారు. వాస్తవానికి, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 238 సీట్లలో పోటీ చేసిన జన్ సూరజ్ పార్టీ ఒక్క నియోజకవర్గంలో కూడా విజయం సాధించలేకపోయింది. పార్టీ అభ్యర్థులు కేవలం 2 నుండి 3 శాతం ఓట్లను మాత్రమే పొందారు, దీంతో ఎక్కువ మంది డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి.