Tirupati Laddu: తిరుమల లడ్డూ కేసులో ఏపీ ప్రభుత్వం నియమించిన స్వతంత్ర సిట్ సభ్యుల పేర్లు ఇవే!
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా పెద్ద ప్రకంపనలు సృష్టించాయి. ఈ వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో, తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందంపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో ఏపీ పోలీసుల జోక్యం ఉండదని, ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తు జరగాలనే ఉద్దేశంతోనే సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు ఉంటున్న నేపథ్యంలో, కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఏపీ నుంచి సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గోపీనాథ్ శెట్టి
ఈ పిటిషన్లను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఐదుగురు సభ్యులతో స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సీబీఐ నుండి ఇద్దరు అధికారులు, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీసులు, ఫుడ్ సేఫ్టీ ఇండియా నుండి ఓ అధికారి సిట్‌లో ఉండాలని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పంపిన సభ్యులలో సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గోపీనాథ్ శెట్టి పేర్లు ఉన్నాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటుచేసిన సిట్‌లో ఈ ఇద్దరు సభ్యులు ఉన్నారు. మొత్తం 9 మంది సభ్యులతో ఏర్పడిన ఈ బృందం తిరుమలను సందర్శించి విచారణ చేపట్టింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేశారు.